2019 లోక్ సభ ఎన్నికలు: ప్రతిపక్ష కూటమితో దోస్తీపై క్లారిటీ ఇచ్చిన కేజ్రీవాల్

Updated: Aug 10, 2018, 06:48 PM IST
2019 లోక్ సభ ఎన్నికలు: ప్రతిపక్ష కూటమితో దోస్తీపై క్లారిటీ ఇచ్చిన కేజ్రీవాల్

ఇటీవల కర్ణాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దేశంలో దాదాపు కేంద్రానికి వ్యతిరేకంగా పనిచేస్తోన్న రాజకీయ పార్టీలన్నీ ఏకమైన సంగతి తెలిసిందే. ఎన్నికల అనంతరం కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రమాణస్వీకారోత్సవం వేదికపై ఒక్కచోటకు చేరిన ప్రతిపక్షాలను చూస్తే 2019 లోక్ సభ ఎన్నికల్లోనూ ఎన్డీఏను ఎదుర్కునేందుకు ఈ పార్టీలన్నీ ఏకమవుతాయా అనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అలా ఏకమైన ప్రతిపక్ష పార్టీలతో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సైతం చేయి కలపడంతో 2019 లోక్ సభ ఎన్నికల్లో ప్రతిపక్ష కూటమితో అరవింద్ కేజ్రీవాల్ చేయి కలుపుతారా అనే చర్చ కూడా జరిగింది. ఇదిలావుండగా తాజాగా ఇదే అంశంపై స్పందించిన అరవింద్ కేజ్రీవాల్.. తమ ఆమ్ ఆద్మీ పార్టీ ఆ ప్రతిపక్ష కూటమితో చేయి కలుపబోదు అని స్పష్టంచేశారు. అంతేకాకుండా సదరు ప్రతిపాదిత ప్రతిపక్ష కూటమికి దేశాభివృద్ధిలో ఎటువంటి పాత్ర లేదు అనే విమర్శలు కూడా చేశారు. ఢిల్లీలోని రోహ్‌తక్‌లో గురువారం విలేకరులతో మాట్లాడుతూ కేజ్రీవాల్ ఈ వ్యాఖ్యలు చేశారు.

2019 లోక్ సభ ఎన్నికల్లో ప్రతిపక్షాల కూటమితో కలవబోమని స్పష్టంచేసిన అరవింద్ కేజ్రీవాల్.. హర్యానాలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లోనూ ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేస్తుందని తెలిపారు. ఢిల్లీలో ప్రజా సంక్షేమం కోసం ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతీ అభివృద్ధి చర్యకు నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఏదో ఓ విధంగా అడ్డు తగులుతోందని అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు.