శునకానికి, గాడిదకు ఘనంగా పెళ్లి చేసి అరెస్ట్ అయ్యారు

ప్రేమికుల రోజుకి వ్యతిరేకంగా శునకానికి, గాడిదకు ఘనంగా పెళ్లి చేసి నిరసన తెలిపిన భారత్ హిందు ఫ్రంట్

Last Updated : Feb 14, 2018, 05:15 PM IST
శునకానికి, గాడిదకు ఘనంగా పెళ్లి చేసి అరెస్ట్ అయ్యారు

సాధారణంగా వర్షాలు పడక కరువు కాటకాలు నెలకొంటేనో లేక ఊరిని ఏదైనా అరిష్టం పట్టుకుందనే మూడనమ్మకాలు వ్యాపించినప్పుడో కొన్ని ప్రాంతాల్లో జంతువులకు గానీ లేదా కప్పలకు కానీ పెళ్లిళ్లు చేసే మూఢ నమ్మకాన్ని అప్పుడప్పుడూ మనం వార్తల్లో చూస్తుంటాం. కానీ కరువు కాటకాలతో సంబంధం లేకుండా చెన్నైలో మాత్రం భారత్ హిందూ ఫ్రంట్ కార్యకర్తలు నేటి వాలెంటైన్స్ డేకు వ్యతిరేకంగా ఓ శునకానికి, గాడిదకు పెళ్లి చేసిన తీరు తాజాగా వార్తల్లోనిలిచింది.  

వాలెంటైన్స్ డేకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టిన భజరంగ్ దళ్.. పబ్లిగ్గా కనిపించిన జంటలకు హెచ్చరికలు జారీచేస్తోంటే.. భారత్ హిందూ ఫ్రంట్ కార్యకర్తలు మాత్రం చెన్నైలో ప్రేమికుల దినోత్సవానికి వ్యతిరేకంగా ఇలా వెరైటీ నిరసన వ్యక్తంచేశారు. వధు, వరులని అలంకరించినట్టుగానే పూల దండలు, పసుపు, కుంకుమలతో శునకాన్ని, గాడిదను ముస్తాబు చేసి పెళ్లి చేసిన భారత్ హిందూ ఫ్రంట్ కార్యకర్తలు.. వాటికి ఊరేగింపు కూడా నిర్వహించారు. 

హిందూ సంప్రదాయం ప్రకారం మాదిరిగానే పెళ్లిలో మహిళలు మంగళహారతులు పట్టుకుని ముందు నడిచారు. వీళ్ల వ్యవహారం గురించి తెలుసుకున్న పోలీసులు వెంటనే నిరసనకారులని అదుపులోకి తీసుకున్నారు. జంతువులతో ఆటలాడుకుంటే, పోలీసులు, జంతు ప్రేమికులు ఊరుకోరు కదా!! అందుకే పోలీసులు వెంటనే రంగంలోకి దిగి ఆ శునకానికి, గాడిదకు విముక్తి కల్పించారు.

Trending News