గాలి జనార్థన్ రెడ్డికి బీజేపీ టికెట్ ఖాయమైందా ?

మైనింగ్ పరిశ్రమలో మైనింగ్ కింగ్‌గా పేరున్న గాలి జనార్థన్ రెడ్డికి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున టికెట్‌ ఖాయమైందా అంటే అవుననే టాక్ బలంగా వినిపిస్తోంది.

Last Updated : Mar 28, 2018, 05:39 PM IST
గాలి జనార్థన్ రెడ్డికి బీజేపీ టికెట్ ఖాయమైందా ?

మైనింగ్ పరిశ్రమలో మైనింగ్ కింగ్‌గా పేరున్న గాలి జనార్థన్ రెడ్డికి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున టికెట్‌ ఖాయమైందా అంటే అవుననే టాక్ బలంగా వినిపిస్తోంది. దేశ రాజకీయాల్లోనే అత్యంత సంపన్న రాజకీయనేతల్లో ఒకరైన గాలి జనార్దన్ రెడ్డికి స్వయాన సోదరుడైన సోమశేఖర్ రెడ్డి స్వయంగా చేసిన ఓ ప్రకటనే అందుకు కారణం. అవును, వచ్చే కర్ణాటక ఎన్నికల్లో గాలి జనార్థన్ రెడ్డి బీజేపీ టికెట్‌పై బళ్లారి నుంచి పోటీ చేస్తారని ఆయన సోదరుడు సోమశేఖర రెడ్డి బుధవారం ప్రకటించారు. కర్ణాటకలోని బళ్లారి జిల్లాకు చెందిన గాలి జనార్దన్ రెడ్డి, గాలి సోమశేఖర్ రెడ్డిలకు బళ్లారి రెడ్డి బ్రదర్స్‌గా అక్కడి రాజకీయ వర్గాలు పిలుచుకుంటుంటాయి. 

బళ్లారి, బెలెకెరి పోర్ట్ అక్రమ మైనింగ్ కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా వున్న గాలి జనార్థన్ రెడ్డి.. ఆ కేసుతోపాటు ఇతర మైనింగ్ కుంభకోణాలన్నింటిలోనూ కలిపి 42 నెలల పాటు జ్యుడిషియల్ కస్టడీలో వున్న సంగతి కూడా తెలిసిందే. మైనింగ్ కుంభకోణాల్లో గాలి జనార్థన్ రెడ్డి ప్రధాన నిందితుడిగా వున్న నేపథ్యంలో బీజేపీ సైతం ఆయన విషయంలో అంటీ ముట్టనట్టుగానే మౌనం వహిస్తూ వస్తోంది. అయితే, తాము మాత్రం పార్టీతోనే ఉన్నామని రెడ్డి బ్రదర్స్ ఎప్పటికప్పుడు చెబుతూ వస్తున్నారు. కర్ణాటక ఎన్నికలు సమీపిస్తున్న ప్రస్తుత తరుణంలో రాష్ట్ర రాజకీయాలని వేడెక్కిస్తూ.. తన సోదరుడు గాలి జనార్థన్ రెడ్డి బళ్లారి నుంచి బీజేపీ టిక్కెట్‌పైనే పోటీ చేస్తారని సోమశేఖర్‌రెడ్డి ప్రకటించడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనియాంశమైంది. 

బీజేపీ అధిష్టానం నుంచి స్పష్టమైన హామీ అంది వుంటుంది కనుకే గాలి సోమశేఖర్ రెడ్డి అంత ధీమాతో ఆ ప్రకటన చేశారని కన్నడ వర్గాలు చర్చించుకుంటున్నాయి. 

Trending News