గర్ల్ ఫ్రెండ్ కోసం దొంగగా మారిన గూగుల్ ఉద్యోగి.. రూ.10,000 చోరి చేస్తూ పట్టివేత

హర్యానాలోని అంబాలా ప్రాంతానికి చెందిన ఆ సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌కి గూగుల్ సంస్థలో జాబ్ చేయాలని కోరిక. ఎన్నో ఇంటర్వ్యూల తర్వాత ఆఖరికి ఆ సంస్థలో ఉద్యోగం దొరకడంతో ఆయన ఆనందానికే హద్దులు లేకుండా పోయింది. లక్షల జీతం వచ్చే ఉద్యోగంలో చేరాక.. ఓ గర్ల్ ఫ్రెండ్ కూడా పరిచయమైంది. 

Last Updated : Oct 11, 2018, 06:17 PM IST
గర్ల్ ఫ్రెండ్ కోసం దొంగగా మారిన గూగుల్ ఉద్యోగి.. రూ.10,000 చోరి చేస్తూ పట్టివేత

హర్యానాలోని అంబాలా ప్రాంతానికి చెందిన ఆ సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌కి గూగుల్ సంస్థలో జాబ్ చేయాలని కోరిక. ఎన్నో ఇంటర్వ్యూల తర్వాత ఆఖరికి ఆ సంస్థలో ఉద్యోగం దొరకడంతో ఆయన ఆనందానికే హద్దులు లేకుండా పోయింది. లక్షల జీతం వచ్చే ఉద్యోగంలో చేరాక.. ఓ గర్ల్ ఫ్రెండ్ కూడా పరిచయమైంది. గర్ల్ ఫ్రెండ్‌ను ఆనందింపజేయడం కోసం ఆయన చేసే ఖర్చులు కూడా పెరిగాయి. వస్తున్న జీతం అంతా హారతి కర్పూరంలా కరిగిపోవడం ప్రారంభమైంది. ఆ డబ్బంతా క్రెడిట్ కార్డు బిల్లులు చెల్లించడానికే సరిపోయేది. ఇక చేసేదేముంది.. అదనపు సంపాదన కోసం ఆ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ దొంగతనాలు కూడా చేయడం ప్రారంభించాడు.

అయితే ఇటీవలే ఆయన అనుకోకుండా సీసీటీవీ కెమెరాలకు చిక్కడంతో అసలు గుట్టు రట్టయింది. సెప్టెంబరు 11వ తేదిన ఐబీఎం కంపెనీ ఓ హోటల్‌లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ల కోసం ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో పాల్గొనడానికి వెళ్లిన గూగుల్ ఉద్యోగి అక్కడ కూడా తన చేతివాటం చూపించాడు. అదే సెమినార్‌కు వచ్చిన ఓ మహిళ బ్యాగ్ నుండి ఆమెకు తెలియకుండా రూ.10,000 కాజేశాడు. 

అయితే తన బ్యాగ్ నుండి డబ్బు అపహరణకు గురైందని తెలుసుకున్న ఆ మహిళ వెంటనే హోటల్ వారికి సమాచారం అందించింది. హోటల్ సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించి.. సీసీటీవీ కెమెరాలు కూడా పరీక్షించడంతో దొంగతనం ఎవరో చేశారో తెలిసిపోయింది. వెంటనే పోలీసులు ఆ దొంగతనానికి పాల్పడిన వ్యక్తి హోటల్‌కి ఎలా వచ్చాడన్న విషయాన్ని కూడా పరిశీలించారు. ఉబర్ క్యాబ్ ద్వారా హోటల్‌కు ఆ వ్యక్తి వచ్చినట్లు నిర్థారించుకున్నారు. సీసీటీవీ కెమెరాలను జూమ్ చేసి.. ఉబర్ క్యాబ్ నెంబర్ ప్లేట్ వివరాలు కూడా తీసుకున్నారు. తర్వాత డ్రైవర్ ద్వారా ఉద్యోగి మొబైల్ నెంబరు పొందారు.

ఆ తర్వాత పోలీసులు సదరు ఉద్యోగికి ఫోన్ చేయగా.. అది స్విచ్ఛాఫ్ అవ్వడంతో వారి అనుమానానికి కూడా బలం చేకూరింది. వెంటనే నిఘా వ్యవస్థను పటిష్టం చేసి.. తర్వాత ఎంక్వయరీ ద్వారా ఆ వ్యక్తి ఎవరో కనుగొన్నారు. ఆయన పనిచేస్తున్న సంస్థకు కూడా సమాచారం అందించి.. తర్వాత ఆ వ్యక్తి ఇంటికి వెళ్లి అరెస్టు చేశారు. లక్షల్లో జీతం తీసుకుంటున్న వ్యక్తి.. కేవలం రూ.10,000 లకు కక్కుర్తి పడడం ఏమిటని పోలీసులు ఆశ్చర్యపోయారు. జీతం చాలడం లేదని.. తన గర్ల్ ఫ్రెండ్ కోసం తాను ఈ పనికి పాల్పడ్డానని ఆ వ్యక్తి చెప్పడంతో వారు కంగుతిన్నారు. 

Trending News