అగ్ని-2 ప్రయోగం విజయవంతమైంది. అణ్వాయుధాలను మోసుకెళ్ళ గలిగే మధ్యతరహా శ్రేణి క్షిపణి అగ్ని-2 ప్రయోగం విజయవంతమైందని రక్షణ శాఖ వెల్లడించింది. ఒడిషా రాష్ట్రంలోని ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుంచి ఈ క్షిపణిని ఉదయం గం.8:38ని. ప్రయోగించినట్టు రక్షణ శాఖ ప్రతినిధి వెల్లడించారు. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో దీన్ని రూపొందించారు. అబ్దుల్ కలాం ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి మొబైల్ లాంచర్ ద్వారా పరీక్ష నిర్వహించగా, లక్ష్యాన్ని ఛేదించిందని ఒక ప్రకటనలో తెలిపారు
అగ్ని-2 క్షిపణి 20 మీటర్ల పొడవు,17 టన్నుల బరువు, వెయ్యి కిలోల పేలోడ్ ను మోసుకుపోగలదు. ఈ క్షిపణి రెండువేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను చేధించగలిగే సామర్థాన్ని కలిగి ఉంది. దీనిని అడ్వాన్స్డ్ సిస్టమ్స్, లేబొరేటరీ, డీఆర్డీఓ, హైదరాబాద్లోని భారత్ డైనమిక్స్ లిమిటెడ్ సంస్థలు కలిసి సంయుక్తంగా తయారుచేశాయి.
అగ్ని క్షిపణి సిరీస్లలో భాగంగా అగ్ని-2 క్షిపణిని ప్రయోగించారు. ఇప్పటికే విజయవంతంగా ప్రయోగించిన అగ్ని-1, అగ్ని-3 క్షిపణుల్లో అగ్ని-1ను దేశ రక్షణ విభాగానికి అప్పగించారు. అగ్ని-3ని కూడా అప్పగించే పనిలో ఉన్నారు.