రూ.1.51 కోట్ల జరిమానా వసూలు చేసిన రైల్వే టీసీ

గతేడాది టికెట్ లేకుండా ప్రయాణించిన ప్రయాణికుల వద్ద నుంచి ఓ టీసీ రికార్డు స్థాయిలో రూ.1.51 కోట్ల జరిమానా వసూలు చేశాడు. మరో ముగ్గురు టీసీలు కోటి రూపాయలకు పైగా జరిమానాల నగదు రైల్వేశాఖకు అందించారు.

Updated: Jan 24, 2020, 08:01 AM IST
రూ.1.51 కోట్ల జరిమానా వసూలు చేసిన రైల్వే టీసీ

న్యూఢిల్లీ: ‘టికెట్ లేని ప్రయాణం నేరం. అందుకు చెల్లించుకోవాల్సి వస్తుంది భారీ మూల్యం’ అంటూ బస్సులు, రైళ్లు, ఇతర ప్రభుత్వ వాహనాలలో ఇలాంటి హెచ్చరికలు తరచుగా చూస్తూనే ఉంటాం. టికెట్ లేకుండా ప్రయాణించడం రైళ్లలోనే అధికమని తెలిసిందే. అయితే ఓ టికెట్ కలెక్టర్ గతేడాది రికార్డు స్థాయిలో రూ.1.51కోట్ల రికార్డు జరిమానాల్ని వసూలు చేశాడని భారతీయ రైల్వే శాఖ అధికారి తెలిపారు. సెంట్రల్ రైల్వేలో పనిచేసే టికెట్ కలెక్టర్ టీసీ ఎస్.బి. గలాండే టికెట్ లేకుండా ప్రయాణించిన 22,680 రైల్వే ప్రయాణికుల వద్ద నుంచి కోటిన్నర వరకు జరిమానా వసూలు చేసి ఆ శాఖకు ఆదాయాన్ని అందించాడు. దీంతో 2019 ఏడాదిలో అత్యధిక జరిమానాలు వసూలు చేసిన టీసీగా గలాండే నిలిచాడు.

గలాండే సహా మరో ముగ్గురు టీసీలు కోటి రూపాయలకు పైగా టికెట్ జరిమానాలు వసూలు చేశారు. ఎంఎం షిండే (సెంట్రల్ రైల్వే) 16,035 మంది టికెట్ తీసుకోని ప్రయాణికుల వద్ద నుంచి గతేడాది రూ.1.07కోట్ల జరిమానాలు కలెక్ట్ చేశాడు. ముంబై డివిజన్‌కు చెందిన చీఫ్ టికెట్ కలెక్టర్ జి.రవికుమార్ రూ.1.45కోట్ల జరిమానాలు వసూలు చేసి రెండో స్థానంలో ఉన్నారు. టికెట్ లేకుండా ప్రయాణించిన 20,657 మందికి రవికుమార్ జరిమానాలు విధించారు. మరో టీసీ డి.కుమార్ టికెట్ లేని 15,234 మంది ప్రయాణికులకు జరిమానా విధించి రూ.1.02కోట్ల నగదు ఆ శాఖ ఆదాయాన్ని సమకూర్చారు.

Also Read: ఇకపై రైలు ప్రయాణం వినోదాత్మకం: భారతీయ రైల్వే

షిండే, డి.కుమార్‌లు లాగ్ డిస్టెన్స్ రైళ్లకు టీసీలుగా చేస్తుండగా.. జి. రవికుమార్ ముంబై సబర్బన్ రైల్వేలో సేవలందిస్తున్నాడని రైల్వేశాఖ అధికారులు తెలిపారు. నిజాయితీగా తమ విధులను నిర్వహించిన ఆ టీసీలను సత్కరించి, ప్రశంసాపత్రాలను అందించినట్లు సెంట్రల్ రైల్వే పీఈర్ఓ శివాజీ సుతర్ తెలిపారు. 2019లో సెంట్రల్ రైల్వే 37.64 లక్షల మంది ప్రయాణికుల వద్ద నుంచి జరిమానాల రూపంలో రూ.192.51కోట్లు ఆర్జించినట్లు అధికారులు వెల్లడించారు. కాగా, 2018లో టికెట్ లేని 34.09 లక్షల ప్రయాణికుల నుంచి రూ.168.30కోట్లు వసూలు చేసిన విషయం తెలిసిందే.   జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..