పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రమాణస్వీకారోత్సవానికి తనకు ఆహ్వానం అందలేదనేదే మన ప్రధాని నరేంద్ర మోదీ ఈర్ష్యకు కారణమా అని ప్రముఖ మాజీ క్రికెటర్, ప్రస్తుత పంజాబ్ రాష్ట్ర మంత్రి నవజ్యోత్ సింగ్ ప్రధాని మోదీని ఎద్దేవా చేశారు. గోద్రా అల్లర్ల కేసులో ప్రధాని మోదీకి ప్రమేయం లేదా అని ప్రశ్నించిన సిద్ధూ.. గోద్రా అల్లర్లతో సంబంధం ఉన్నటువంటి వారు చేసే ఆరోపణలకు స్పందించాల్సిన అవసరం తనకు లేదు అంటూ మోదీపై నవజ్యోత్ సింగ్ సిద్ధూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. చత్తీస్ఘడ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం కోసం కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేసిన స్టార్ క్యాంపెయినర్లలో సిద్ధూ కూడా ఒకరు అనే సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మోదీపై విమర్శలు గుప్పిస్తూ శనివారం సిద్ధూ ఈ వ్యాఖ్యలు చేశారు.
పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రమాణస్వీకారోత్సవానికి వెళ్లిన నవజ్యోత్ సింగ్ సిద్ధూ అక్కడ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ని హత్తుకుని మాట్లాడటంపై ప్రధాని నరేంద్ర మోదీ సహా బీజేపీ నేతలు అనేక వేదికలపై తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.