కొత్త రూల్: సర్కారు బడుల్లోనే ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు చదవాలట

కొత్త రూల్: సర్కారు బడుల్లోనే ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు

Last Updated : Aug 31, 2018, 06:16 PM IST
కొత్త రూల్: సర్కారు బడుల్లోనే ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు చదవాలట

కర్నాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలను సర్కారు బడుల్లోనే చదివించేలా కుమారస్వామి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఇలా చేస్తే ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యతమైన విద్యనందించడంతోపాటు, సదుపాయాలు కూడా మెరుగుపడుతాయని ఆ రాష్ట్ర ప్రాథమిక విద్యాశాఖ భావిస్తోంది. ప్రభుత్వ స్కూళ్లలో చదివే విద్యార్థుల సంఖ్య పెంచాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కర్ణాటక రాష్ట్ర ప్రాథమిక విద్యాశాఖ తెలిపింది.

కర్ణాటక రాష్ట్ర ప్రాథమిక విద్యాశాఖ మంత్రి మహేష్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలను సర్కారు బడుల్లో చేర్పించాలని భావిస్తున్నాం. ఇందుకోసం చట్టపరమైన అంశాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. అయితే న్యాయపరంగా/చట్టపరంగా ఈ నిబంధన నిలుస్తుందో లేదో చెప్పలేమని అన్నారు. దీనిపై  న్యాయనిపుణుల సలహా కోరినట్లు చెప్పిన మంత్రి.. సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా వెళ్లలేమన్నారు (పిల్లలు ఎక్కడ చదవాలో నిర్ణయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు లేదంటూ గతంలో సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది).

సెప్టెంబర్ 2017లో కర్ణాటక ప్రభుత్వం తొలిసారి నిబంధనలు తీసుకొచ్చింది. ప్రభుత్వం నుంచి జీతాలు తీసుకొనే ఉద్యోగులు తమ పిల్లలను సర్కారు బడులకు పంపాలని.. లేకపోతే చర్యలు తీసుకుంటామని 2017 నివేదికలో పేర్కొంది. నాణ్యమైన విద్య అందించడం, మరిన్ని సదుపాయాలు ప్రభుత్వ పాఠశాలకు కల్పించడంలో భాగంగా ఈ తరహా నిబంధన తీసుకొచ్చినట్లు తెలిపింది.

Trending News