జమ్మూ కశ్మీర్‌లోని కథువా ప్రాంతంలోని రసానా గ్రామంలో 8 ఏళ్ల బాలికను అతి దారుణంగా అత్యాచారం చేసి, హత్య చేసిన ఘటనపై విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. కేసు విచారణను జమ్ముకశ్మీర్‌లో వద్దని, వేరే న్యాయస్థానం అయనటువంటి చండీగఢ్‌కు బదిలీ చేయాలని కోరుతూ కథువా చిన్నారి తండ్రి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. జమ్మూలో కేసు విచారణ జరిగితే కేసును ప్రభావితం చేస్తారని పిటీషన్ దాఖలు చేశారు. ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకు దానిపై విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు వెల్లడించింది. కథువా బాధితురాలి కుటుంబ తరఫున వాదిస్తున్న న్యాయవాది దీపీకసింగ్ రాజవత్ తన ప్రాణాలకు ముప్పు ఉందని ఆరోపిస్తున్నారు.
ట్రయల్ కోర్టులో విచారణ మొదలు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసుపై జమ్ములోని ట్రయల్ కోర్టు విచారణ ప్రారంభించింది. ఈ కేసులో ఒక బాలనేరస్థుడు సహా 8 మంది నిందితులు ఉన్నారు. బాలనేరస్థుడి కేసును నిబంధనల ప్రకారం చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో విచారిస్తారని అధికారులు తెలిపారు. ఏడుగురు నిందితులపై సెషన్స్ కోర్టులో విచారణ జరిగింది. తాము ఏ తప్పూ చేయలేదని నిందితులు కోర్టుకు తెలిపారు. తమకు నార్కో టెస్టు కూడా నిర్వహించాలని జడ్జిని కోరారు. కేసుకు సంబంధించి ఛార్జ్‌షీట్ కాపీలను నిందితులకు అందజేయాల్సిందిగా జడ్జి రాష్ట్ర క్రైం బ్రాంచిని ఆదేశించారు. అనంతరం విచారణను ఏప్రిల్ 28కి వాయిదా వేశారు. ఈ కేసులో ఇద్దరు ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్లను జమ్మూకశ్మీర్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
ఈ ఏడాది జనవరిలో కథువాలో బాలికను ఎత్తుకుపోయి మత్తుమందులు ఇచ్చి వారం రోజుల పాటు నిర్బంధించి అత్యంత దారుణంగా అత్యాచారానికి ఒడిగట్టి, ఆ తర్వాత హత్య చేసి సమీపంలోని అటవీ ప్రాంతంలో పడేశారు. జనవరి 17న బాలిక మృతదేహం దొరికింది. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తరువాత ఒళ్లు జలదరించే నిజాలు బయటకు రావడంతో ఈ ఉదంతంపై దేశ వ్యాప్తంగా ఆందోళనలు తీవ్రమయ్యాయి.