శివభక్తుడిగా మారిన రాహులుడు

గుజరాత్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆలయాలను కూడ సందర్శిస్తున్న సోనియా కుమారుడు 

Last Updated : Nov 13, 2017, 08:11 PM IST
శివభక్తుడిగా మారిన రాహులుడు

కాంగ్రెస్  ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ శివ భక్తుడి అవతారమెత్తారు. గుజరాత్ ఎన్నికల్లో భాగంగా ప్రచారయాత్రలో ఉన్న అతను స్థానిక హిందూ దేవాలయాలను సంచరిస్తూ, తన భక్తిని చాటుకుంటున్నారు. ఈ క్రమంలో తనకు ఎదురైన మీడియా వారితో తాను గొప్ప శివ భక్తుడినని, ఆయన లాగే నిజాయతీని నమ్ముకున్న వ్యక్తినని తెలియజేశారు. పఠాన్ ప్రాంతంలోని వీరమేఘమయ ఆలయాన్ని సంచరించిన రాహుల్ ఆ తర్వాత ప్రసిద్ధ దేవాలయాలైన అంబాజీ గుడిని, అక్షరధామాన్ని కూడా దర్శించారు. తొలుత ద్వారకాధీశుని దర్శనం చేసుకొని గుజరాత్‌కు ప్రచారయాత్ర చేయడానికి వచ్చిన రాహుల్, ఆ తర్వాత వరుసపెట్టి ఆలయాలను సందర్శించడం మొదలు పెట్టారు. అయితే ఇప్పటివరకు దేవుడిపై లేని భక్తి, ఎన్నికల సమయంలో మాత్రం బయటికొచ్చిందని.. దీనిని ఏ విధంగా అర్థం చేసుకోవాలని కొందరు బీజేపీ నాయకులు రాహుల్‌ని ప్రశ్నిస్తున్నారు. 

శనివారం నుండి తన ప్రచారయాత్రలో ఉన్న రాహుల్ మాత్రం సౌరాష్ట్ర, మధ్య గుజరాత్, దక్షిణ గుజరాత్ ప్రాంతాల్లో తన యాత్రను ముగించారు. మొత్తం మూడు రోజులు సాగిన ఈ ప్రచార యాత్రలో కాంగ్రెస్ లక్ష్యాలను  ప్రజలకు వివరించడానికి ప్రయత్నించారాయన. డిసెంబరు 9 నుండి 14వ తేదీ వరకు జరిగే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కూడా బీజేపీకి కీలక పోటీదారుగా మారింది. ఈ క్రమంలో బీజేపీ ఒక సునామీ లాంటి పార్టీని ఎదుర్కోవడానికి సిద్ధపడుతుందని రాహుల్ చమత్కరించారు. ఇది సత్యానికి, అసత్యానికి జరిగే గొప్ప పోరాటమని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే తాను బీజేపీ హయాంలో ప్రభుత్వం అవలంబిస్తున్న పాలసీలనే తప్పు పడుతున్నాను గానీ, వ్యక్తిగతంగా ప్రధాని మోడీ అంటే తనకు ఎనలేని గౌరవమని కూడా చెప్పారు రాహుల్. అలాగే జీఎస్టీకి సంబంధించి, అది ఒక గబ్బర్ సింగ్ ట్యాక్స్ లాంటిదని ఎద్దేవా చేశారు. 

Trending News