లక్నో: ఉత్తర్ ప్రదేశ్లోని మవు జిల్లా మొహమ్మదాబాద్లో సోమవారం ఉదయం 7.30 గంటలకు గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో ఏడుగురు దుర్మరణంచెందగా మరో 15 మంది గాయపడ్డారు. పేలుడు ధాటికి రెండంతస్తుల భవనం కుప్పకూలింది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు అగ్నిమాపక శాఖ బృందాలతో కలిసి సహాయచర్యలు చేపట్టారు. ఈ దుర్ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. క్షతగాత్రులకు తగిన వైద్య చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, ఎస్ఎస్పీకి ఆదేశాలు జారీచేశారు.
స్థానికులు చెబుతున్న వివరాల ప్రకారం సిలిండర్ పేలుడు తర్వాత ఇంటికి నిప్పంటుకుందని, ఆ తర్వాతే ఇల్లు కుప్పకూలిందని తెలుస్తోంది.