సభను రాజ్యాంగబద్ధంగా జరుపుకుందాం: వెంకయ్య నాయుడు

పార్లమెంటు 251వ బడ్జెట్ సమావేశాలను రాజ్యసభలో ఫలప్రదంగా నిర్వహించడంలో అన్ని పార్టీలూ సహకారం అందించాలని రాజ్యసభ చైర్మన్ శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు కోరారు. సభను అడ్డుకోకుంటే..

Last Updated : Jan 31, 2020, 08:32 PM IST
సభను రాజ్యాంగబద్ధంగా జరుపుకుందాం: వెంకయ్య నాయుడు

న్యూఢిల్లీ: పార్లమెంటు 251వ బడ్జెట్ సమావేశాలను రాజ్యసభలో ఫలప్రదంగా నిర్వహించడంలో అన్ని పార్టీలూ సహకారం అందించాలని రాజ్యసభ చైర్మన్ శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు కోరారు. సభను అడ్డుకోకుంటే.. అందరికీ తమ వాణిని వినిపించే అవకాశం కలుగుతుందని, రాజ్యసభ 250వ సమావేశాలు జరిగిన తీరును కొనసాగిద్దామని ఆయన అన్నారు. ఏడాది పొడగునా దేశ ఆర్థిక ప్రగతిని నిర్దేశించే బడ్జెట్ సమావేశాల సందర్భంగా పద్దుపై సరైన చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. శుక్రవారం ఉపరాష్ట్రపతి నివాసంలోని సర్దార్ పటేల్ సభాప్రాంగణంలో రాజ్యసభ అఖిలపక్ష నేతలకు ఆయన తేనీటి విందు ఏర్పాటుచేశారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అనవసర వివాదాల్లేకుండా రాజ్యాంగబద్ధంగా సభను నిర్వహించుకోవాల్సిన అవసరాన్ని అందరూ గుర్తించాలన్నారు. ‘ప్రతి పార్లమెంటు సమావేశమూ కీలకమే కానీ.. బడ్జెట్ సమావేశాలు మరింత కీలకం. కొత్త సమస్యలు సవాల్ విసురుతున్న నేపథ్యంలో ఈసారి బడ్జెట్ సమావేశాలు మరింత కీలకం కానున్నాయి. పార్లమెంటు ఉభయసభలను ఉద్దేశించి గౌరవ రాష్ట్రపతి గారి ప్రసంగానికి ధన్యవాదాలు తెలపడంతోపాటు 2020-21 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌పైనా విస్తృతంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో సభలు సజావుగా జరగాల్సిన అవసరం ఉంది’ అని రాజ్యసభ చైర్మన్ అన్నారు.
 
వారం రోజులపాటు జరగనున్న చర్చలో రాజ్యసభలోని అన్ని పార్టీలకు తమ ఆలోచనలు వెల్లడించేందుకు అవకాశం లభిస్తుందని.. ప్రజల సమస్యలను పార్లమెంటు దృష్టికి తీసుకొచ్చేందుకు వీలుంటుందని రాజ్యసభ చైర్మన్ అన్నారు. గతవారమే 71వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకున్న విషయాన్ని గుర్తుచేస్తూ.. గణతంత్ర ప్రజాస్వామ్యంగా సాధించిన విజయాలను, సాధించాల్సిన అంశాలను చర్చించుకోవడం మన బాధ్యతని ఆయన పేర్కొన్నారు.

ఈ సమావేశాల్లో చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం పలు ముఖ్యమైన అంశాలను సభ ముందుకు తీసుకురానుందని తెలిసింది. దీంతోపాటుగా వివిధ అంశాలపై విపక్ష పార్టీల్లో నెలకొన్న ఆందోళనలకు కూడా ప్రభుత్వం సమాధానం చెబుతుందని ఆశిస్తున్నాను. రాజ్యసభ చైర్మన్‌గా ఎగువసభలో అన్ని పార్టీలు తమ వాణిని  వినిపించేందుకు అవకాశం ఇస్తాను. అందుకు తగిన సమయాన్ని కూడా కేటాయిస్తాను’ అని ఆయన పేర్కొన్నారు. 

చాలాకాలం తర్వాత రాజ్యసభ 249వ, 250వ సమావేశాలు వందశాతం ఫలప్రదమైన విషయాన్ని రాజ్యసభ చైర్మన్ ఉటంకించారు. ప్రజల్లో పార్లమెంటు వ్యవస్థపై గౌరవాన్ని పెంచేలా గత సమావేశాలు జరగడం అభినందనీయమన్నారు. ఆ సమావేశాల స్ఫూర్తితో 251వ రాజ్యసభ సమావేశాలను కూడా ఫలప్రదంగా నిర్వహిచేందుకు అన్ని పార్టీలు సహకరించాలన్నారు. ప్రజాసమస్యలను సభలో లేవనెత్తి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకు.. రాజ్యాంగబద్ధమైన మార్గాలున్నాయని ఆయన అన్నారు. ఈ సమస్యలను వీటిపై చర్చించేందుకు సభవద్ద చాలినంత సమయం కూడా ఉందన్నారు.

ఈ కార్యక్రమంలో రాజ్యసభలో అధికార పక్షనేత శ్రీ థావర్‌చంద్ గెహ్లాట్, విపక్ష నేత శ్రీ గులాంనబీ ఆజాద్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషి, కేంద్ర మంత్రులు శ్రీ పీయుష్ గోయల్, శ్రీ ప్రకాశ్ జవడేకర్, వి.మురళీధరన్  తోపాటు వివిధ పార్టీల పక్షనేతలు పాల్గొన్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News