చిన్నప్పుడు గడిపిన ఇంటికి వెళ్లి.. కన్నీళ్ల పర్యంతమైన స్మృతి ఇరానీ

కేంద్రమంత్రి స్మృతి ఇరానీ తాను చిన్నప్పుడు పుట్టి పెరిగిన ఇంటికి వెళ్లి పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.

Last Updated : Sep 16, 2018, 10:43 PM IST
చిన్నప్పుడు గడిపిన ఇంటికి వెళ్లి.. కన్నీళ్ల పర్యంతమైన స్మృతి ఇరానీ

కేంద్రమంత్రి స్మృతి ఇరానీ తాను చిన్నప్పుడు పుట్టి పెరిగిన ఇంటికి వెళ్లి పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. తాను స్నేహితులతో కలిసి తిరిగిన వీధులు.. మిత్రులతో కలిసి ఛాట్ తినడానికి వెళ్లిన హోటల్.. తాను స్కూలుకి వెళ్లేటప్పుడు రోజూ కనిపించే రిక్షా స్టాండ్.. వాటినన్నింటినీ మళ్లీ సందర్శించి ఉద్వేగానికి గురయ్యారు. వెంటనే కన్నీళ్లు పెట్టుకున్నారు. తాను పెరిగిన ఇల్లు ఇప్పుడు షాపుగా మారిపోయింది. ఆ షాపులోకి వెళ్లి అక్కడ కొద్దిసేపు గడిపిన స్మృతి ఇరానీ.. అదే ప్రాంతంలో నివసిస్తున్న తన చిన్ననాటి స్నేహితులను కూడా కలిశారు. వారి పిల్లలను ముద్దు పెట్టుకున్నారు.

గురుగ్రామ్‌లో ఉన్న ఇంట్లో స్మృతి ఇరానీ కుటుంబం అనేక రోజులు అద్దెకు ఉండడం జరిగింది. దాదాపు 35 సంవత్సరాల తర్వాత మళ్లీ ఆ ఇంటికి ఆమె వెళ్లారు. తన ఇంటిలో గడుపుతూ స్మృతి ఉద్వేగానికి లోనైన క్షణాలను సినీ నిర్మాత ఏక్తా కపూర్ తన కెమెరాలో బంధించారు. తర్వాత ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో అంతర్జాలంలో బాగా వైరల్ అవుతోంది. 

స్మృతి ఇరానీ బాల్యం మొత్తం కూడా ఢిల్లీ పరిసర ప్రాంతాల్లోనే గడిచింది. ఆమె తల్లి ఓ అస్సామీ కాగా.. తండ్రి పంజాబీ. 1998లో మిస్ ఇండియా కాంటెస్ట్ ఫైనల్స్‌కు చేరిన అమ్మాయిల్లో స్మృతి ఇరానీ కూడా ఒకరు. ఆ తర్వాత ఆమె అనేక టీవీ సీరియళ్లతో పాటు సినిమాల్లో కూడా నటించారు. 2003లో భారతీయ జనతా పార్టీలో చేరారు. 2004లో మహారాష్ట్రలో బీజేపీ యువజన విభాగానికి వైస్ ప్రెసిడెంట్ అయ్యారు. 2010లో బీజేపీ జాతీయ కార్యదర్శిగా ఎన్నికైన స్మృతి ఇరానీ.. అదే సంవత్సరం బీజేపీ మహిళా మోర్చ అధ్యక్షురాలిగా కూడా ఎన్నికయ్యారు. 2014 ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వచ్చాక ఆమె కేంద్రమంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టారు.

 

Trending News