ఇది కార్తీకమాసం. ఈ మాసంలో వనభోజనాలు చేయడం అనాదిగా వస్తున్న ఆనవాయితీ. బంధుమిత్రకుటుంబ సమేతంగా అడవులకు, కొండ కోనలకు వెళ్లి వంటలు చేసుకొని సంతృప్తిగా చెట్ల మధ్యలో కింద కూర్చొని విస్తర్లపై భోజనాలు చేయడం కార్తీక వనభోజనాల ప్రత్యేకత. అంతదూరం వెళ్లలేనివారు ఊరి శివార్లలో విస్తారంగా ఉన్న చెట్ల మధ్యలో, పార్కుల్లో, పొలాల్లో, తోటల్లో కూడా వనభోజనాలు జరుపుకుంటారు. ఆటపాటలతో సంతోషంగా గడుపుతారు.
ఎందరో దేవతలు వనాలు, కొండకోనల్లో వెలిశారు. సుప్రసిద్ధ శైవ, వైష్ణవ క్షేత్రాలు కూడా అడవుల్లో, కొండల్లో వెలిశాయి. అందువల్ల వనభోజనాలు చేయడం దేవతా ప్రీతికరమని ప్రతీతి. విష్ణువుకు ప్రతీక అయిన ఉసిరిచెట్టు కింద పనస ఆకుల విస్తర్లలో భోజనాలు చేయడం కార్తీక వనభోజనాల సంప్రదాయం.
మరే మాసంలో లేనట్టు ఈ కార్తీకమాసంలోనే వనభోజనాలు ఎందుకు చేస్తారు అని పెద్దలను అడిగితే - 'శ్రావణ భాద్రపదాలలో వర్షాలు విస్తారంగా కురుస్తాయి. శరదృతువులో (ఆశ్వీయుజ-కార్తీకం) వచ్చేసరికి భూమి నుంచి కొత్త మొక్కలు మొలకెత్తుతాయి. వనభోజనాలు సమయంలో ఆయుర్వేద వైద్యం తెలిసిన వాళ్లు ఆ మొక్కల విశేషాల్ని, ఉపయోగాన్ని చెప్పేవారు. చదువు సంధ్యలు లేనివారు ప్రత్యక్షంగా చూసి ఆయుర్వేద కిటుకులు తెలుసుకునేవారు, వాటికి ఎటువంటి కీడు తలపెట్టేవారుకాదు.
ప్రకృతి, వృక్షాలను ప్రేమించే గుణాన్ని పెంపొందించే ఉద్దేశంతో చేపట్టే కార్తీక వనభోజనాలు మనుషుల మధ్య సామరస్యాన్ని కూడా పెంచుతాయి అనడం నిజంగా గొప్ప విశేషమే.. !