Disha SOS Effect: దిశా SOS యాప్ ను ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా పరిగణిస్తున్నారు. నిన్న నెల్లూరు జిల్లా కందుకూరులో జరిగిన ఘటన దీనికి ఉదాహరణగా నిలుస్తోంది. అర్ధరాత్రి ఒంటరిగా వెళ్తున్న మహిళలను కొందరు ఆగంతకులు బలవంతంగా ఆటోలోకి లాకెళ్లే ప్రయత్నం చేశారు. కారులో అటుగా వెళుతున్న దామోదర రావు అనే వ్యక్తి గమనించి దిశ SOS కు కాల్ చేసి సమాచారం ఇచ్చారు.
దిశ SOS కు కాల్ వచ్చిన వెంటనే కమాండ్ కంట్రోల్ టీం కందుకూరు పోలీసులను అలెర్ట్ చేశారు. శాంతినగర్ ప్రాంతంలో నైట్ డ్యూటీ లో ఉన్న సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే సంబంధిత లొకేషన్ కు చేరుకున్న పోలీసులు మహిళపై అఘాయిత్యానికి పాల్పడుతున్న ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఇదంతా కేవలం 2 నిముషాల వ్యవధిలోనే జరిగిపోయింది.
ఇక సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను పరిశీలిస్తే..
జూన్ 6 అర్ధరాత్రి 12:30 నిముషాల ప్రాంతంలో ఒక మహిళ బస్ దొరకకపోవడంతో.. నడుచుకుంటూ ఇంటికి వెళ్తోంది. కందుకూరులోని శాంతినగర్ వద్ద గల పెట్రోల్ బంక్ వద్దకు రాగానే ఆటోలో వచ్చిన కొందరు వ్యక్తులు మహిళను అడ్డుకున్నారు. బలవంతంగా ఆమెను ఆటోలోకి లాక్కెళ్లే ప్రయత్నం చేశారు. కారులో అటుగా వెళ్తున్న దామోదర రావు అనే వ్యక్తి గమనించి వెంటనే దిశ SOS కు కాల్ చేసి సమాచారం అందించారు. వెంటనే దిశ కమాండ్ కంట్రోల్ టీం కందుకూరు పోలీసులను అలెర్ట్ చేసింది. సంఘటన జరిగిన ప్రాంతానికి దగ్గరలోనే నైట్ డ్యూటీలో ఉన్న సిబ్బందికి సమాచారం చేరవేశారు. కేవలం 2 నిముషాల వ్యవధిలోనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇంతలో మహిళ కేకలు విన్న పెట్రోల్ బంక్ సిబ్బంది ఆగంతకులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆగంతకులు పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు చేరుకొని పట్టుకోవడం జరిగింది.
బాధితురాలికి మాట్లాడలేక పోవడం, వినికిడి సమస్య ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. బాధితురాలిని సురక్షితంగా పోలీసు వాహనంలో ఇంటికి తీసుకెళ్లి వదిలిపెట్టారు. అదేవిధంగా మహిళకు, కుటుంబసభ్యులకు దిశ టీం మనోధైర్యాన్ని కల్పించింది. మరోవైపు మహిళపై అఘాయిత్యానికి పాల్పడిన ముగ్గురు నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. ముగ్గురు నిందితుల్లో ఇద్దరు గూర్కాలు కాగా, మరో వ్యక్తి ఆటో డ్రైవర్ గా పోలీసులు గుర్తించారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముగ్గురు నిందితులపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అదేవిధంగా అర్ధరాత్రి సమయంలో జరుగుతున్న అఘాయిత్యాన్ని గమనించి దిశ SOS కు కాల్ చేసిన దామోదర రావు ను పోలీసులు అభినందించారు.
ఇలాంటి సామాజిక బాధ్యత గల అనేక మంది తమ కళ్ళ ముందు జరిగే అన్యాయాలను చూసి దిశ SOS కు సమాచారం ఇచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయని దిశ ఉన్నతాధికారులు చెబుతున్నారు. దాదాపు 1 కోటి 17 లక్షల మందికి పైగా ప్రజలు దిశ SOS ను రిజిస్టర్ చేసుకొని వాడుతున్నట్లు తెలిపారు. నేరాలను అరికట్టడంలోనూ, దోషులకు శిక్ష విధించడం లోనూ దిశ కీలకంగా పనిచేస్తోందని సామాన్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.