ముస్లిముల పర్వదినం బక్రీద్ సెలవు విషయంలో చిన్న మార్పు మళ్లీ చోటుచేసుకుంది. ఆగస్టు 22 తేదినే బక్రీద్ పర్వదినాన్ని జరుపుకోవాలని ఢిల్లీ షాహీ ఇమామ్ అహ్మద్ బుఖారీ సోమవారం ఒక ప్రకటనలో తెలపడం గమనార్హం. నిజానికి బక్రీద్ పండుగ ఈనెల 22వ తేదినే ఉంటుందని తొలుత మీడియా ద్వారా తెలియజేసినప్పటికీ.. తర్వాత పండగను 23వ తేదికి మార్చడం జరిగింది.
అయితే చంద్ర దర్శనం ప్రకారం బక్రీద్ పర్వదినాన్ని 22వ తేదినే జరుపుకోవాలని తాజా ప్రకటనలో ఢిల్లీ షాహీ ఇమామ్ అహ్మద్ బుఖారీ తెలియజేయడం జరిగింది. ఈ క్రమంలో బక్రీద్ సందర్భంగా బుధవారం సెలవు ప్రకటిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం కూడా తెలిపింది. రంజాన్ మాదిరిగానే బక్రీద్ కూడా ఒక ప్రత్యేకమైన పర్వదినం.
ఈ పర్వదినాన ఖుద్బా (ధార్మిక ప్రసంగం)తో ఈద్గాలో సామూహిక ప్రార్థనలు ప్రారంభమవుతాయి. బక్రీద్ సందర్భంగా సికింద్రాబాద్ ప్రాంతంలోని ఈద్గా వద్ద ఉదయం 8 గంటల నుంచి 11:30 గంటల వరకు వన్ వే అమలులో ఉంటుందని పోలీసు అధికారులు తెలియజేశారు. ఇస్లామియా క్యాలెండర్లోని విషయాల ప్రకారం ప్రతీ సంవత్సరం జిల్ హజ్ నెలలో నెలవంక దర్శనం ఇచ్చిన పదవ రోజు మహమ్మదీయ సోదరులు బక్రీద్ పండుగ జరుపుకుంటారని ప్రతీతి.