ఆంధ్రా గాంధీ.. అపర భీష్ముడు "వావిలాల"

మహాత్మాగాంధీ ఉప్పు సత్యాగ్రహంతో ఏ విధంగా బ్రిటీష్ వారిని గడగడలాడించారో.. అదే విధంగా ఓ తెలుగు వ్యక్తి ఆంధ్రదేశంలో పల్నాడు పుల్లరి సత్యాగ్రహంలో తిరుగులేని పాత్ర పోషించారు.

Last Updated : Sep 17, 2018, 12:27 AM IST
ఆంధ్రా గాంధీ.. అపర భీష్ముడు "వావిలాల"

మహాత్మాగాంధీ ఉప్పు సత్యాగ్రహంతో ఏ విధంగా బ్రిటీష్ వారిని గడగడలాడించారో.. అదే విధంగా ఓ తెలుగు వ్యక్తి ఆంధ్రదేశంలో పల్నాడు పుల్లరి సత్యాగ్రహంలో తిరుగులేని పాత్ర పోషించారు. ప్రజా ఉద్యమాలే తన ఊపిరిగా బతికారు. గ్రంథాలయోద్యమంలోనూ చురుగ్గా పాల్గొన్నారు. తెల్లదొరలను ఎదిరించి జైలు జీవితం కూడా గడిపారు. పాత్రికేయునిగా.. రచయితగా.. అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా బహుముఖ పాత్రలు పోషించిన మేటి వ్యక్తి వావిలాల గోపాలకృష్ణయ్య గారి జయంతి సందర్భంగా ఈ వ్యాసం మీకోసం ప్రత్యేకం

* వావిలాల గోపాలకృష్ణయ్య 17 సెప్టెంబరు 1906 తేదిన గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లి అనే గ్రామంలో పేరిందేవి, నరసింహం దంపతులకు జన్మించారు. చదువుకునే రోజుల్లోనే స్వాతంత్ర్య ఉద్యమం వైపు ఆకర్షితులయ్యారు. యువకుడిగా ఉన్నప్పుడే స్వరాజ్య భిక్ష పేరుతో ఇంటింటికి తిరిగి జొన్నలు సేకరించి కార్యకర్తలకు భోజనం ఏర్పాటు చేసేవారు. తర్వాత బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పట్టుబడిన వావిలాల ఎనిమిదేళ్లు జైలుశిక్ష అనుభవించారు. 

*ఆ తర్వాత వావిలాల కొన్నాళ్లు ఆంధ్రపత్రికకు ఉప సంపాదకుడిగా పనిచేశారు. 1925లో సత్తెనపల్లిలో శారదా గ్రంథాలయాన్ని స్థాపించారు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని మళ్లీ అరెస్టయ్యారు. ఆ తర్వాత 1946, 1947 ప్రాంతాల్లో రహస్య జీవితం కూడా గడిపారు. 

*స్వాతంత్ర్యం వచ్చాక.. కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతాల వైపు మొగ్గు చూపిన వావిలాల, 1952-72 సంవత్సరాల మధ్య నాలుగు సార్లు శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు. స్వతంత్ర అభ్యర్థిగానూ ఆయన పోటీ చేసి గెలిచారు.  గుంటూరు జిల్లాలో నందిగొండ ప్రాజెక్టు ఉద్యమంలో వావిలాల చాలా పెద్ద పాత్ర పోషించారు. 

*1968లో ప్రపంచ శాంతి సదస్సులో భాగంగా భారత దేశ ప్రతినిధిగా వావిలాల రష్యా దేశంలో కూడా పర్యటించారు. అలాగే తెలుగు భాషా పరిరక్షణ కోసం కూడా వావిలాల తిరుగులేని పోరాటం చేశారు. విద్యకు మాతృభాష, పాలనకు ప్రజల భాష, శిశువుకు తల్లిపాల వంటిదని ఆయన అనేవారు. 1976-78 సంవత్సరాల మధ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అధికార భాషా సంఘం అధ్యక్షునిగా ఉన్నప్పుడు వావిలాల ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. మాతృభాషలో బోధనకు పెద్దపీట వేశారు. తెలుగును అధికార భాషగా ప్రవేశపెట్టాలని వావిలాల చట్టసభ వేదికగా పోరాటం కూడా చేశారు.

*ఎప్పుడూ ఖద్దరు మాత్రమే ధరించే వావిలాలను ఆయన అభిమానులు ఆంధ్రా గాంధీ అని పిలుచుకొనేవారు. 1979లో వావిలాలను ఆంధ్ర విశ్వవిద్యాలయం ‘కళాప్రపూర్ణ’ బిరుదుతో సత్కరించింది.

*రచయితగా కూడా వావిలాల ఎంతగానో పేరుగాంచారు. మద్రాసు మంత్రివర్గమా ఎక్కడికి?, విశాలాంధ్రం, ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయోద్యమం లాంటి అమూల్యమైన రచనలతో వావిలాల రాష్ట్ర రాజకీయ చరిత్రను రికార్డు చేశారు. 

*1990లో సంపూర్ణ మద్య నిషేధ రాష్ట్ర స్థాయి కమిటీ అధ్యక్షునిగా వ్యవహరించారు. గ్రామాలకు కాలినడకన వెళ్లి మరీ మద్యపానం వల్ల కలిగే అనర్థాలను ఆయన వివరించేవారు.

*కేంద్ర ప్రభుత్వం 1992లో వావిలాల వారికి ‘పద్మ భూషణ్’ పురస్కారాన్ని అందజేసింది. తన జీవితకాలంలో ఎప్పుడూ వావివాల వారు రైలు ప్రయాణం చేసేటప్పుడు మొదటి క్లాసులో ప్రయాణించేవారు కాదట. సాధారణ ప్రయాణికులతో కలిసి సెకండ్ క్లాసులోనే ప్రయాణించేవారు.

*29 ఏప్రిల్ 2003 తేదిన వావిలాల 96 ఏళ్ల వయసులో అనారోగ్యంతో మరణించారు. ఆయన స్మారకార్థం వావిలాల గోపాలకృష్ణయ్య ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ హయర్ స్టడీస్ అనే సంస్థని గుంటూరు అరండల్‌పేటలో ఏర్పాటు చేసారు.

Trending News