హైదరాబాద్ పాతబస్తీకి చెందిన అజహర్ మఖ్సూసీ నాలుగేళ్ల వయసులోనే తండ్రి మరణించడంతో పేదరికం ఏమిటో దగ్గరుండి చూశాడు. ఎన్నో నిద్రలేని రాత్రుళ్లు ఆకలితో గడిపాడు. అందుకే జీవితంలో గెలవాలని చిన్నప్పుడే అనుకున్నాడు. కష్టపడి పైకొచ్చాడు. అంచెలంచెలుగా ఎదుగుతూ సొంతంగా ఓ ప్లాస్టర్ ఆఫ్ పారిస్ ఇంటీరియర్ డిజైనింగ్ బిజినెస్ ప్రారంభించాడు. జీవితం కూడా సుఖంగా వెళ్లిపోతోంది. ఓ సారి ఆయన డబీర్ పూరా బ్రిడ్జ్ దాటి వెళ్తుంటే.. చిక్కిశల్యమైన శరీరంతో ఒకామె కనిపించింది.
నాలుగు రోజులుగా తిండి లేదని.. కాస్త అన్నం పెట్టించమని ప్రాథేయపడింది. వెంటనే అజహర్కి తన చిన్నప్పటి రోజులు గుర్తుకువచ్చాయి. తాను పడిన ఆకలి కష్టాలు గుర్తుకువచ్చాయి. వెంటనే ఆమెకు అన్నం పెట్టించాడు. కానీ ఇంటికి వెళ్లాక ఎన్నో ఆలోచనలు. డబీర్ పూర రోడ్ చుట్టు ప్రక్కల ప్రాంతాలతో పాటు, గాంధీ ఆసుపత్రి ప్రాంతంలో రోజూ ఆయన అనేకమంది పేదవాళ్లను చూస్తుంటాడు. వారిలో అనేకమంది కేవలం ఆకలి బాధ భరించలేక చనిపోతుంటారని తన స్నేహితుల ద్వారా విన్నాడు. అందుకే ఆ అభాగ్యుల కోసం ఏదైనా చేయాలని అనుకున్నాడు.
కనీసం రోజుకు 300 నుంచి 400 మందికి భోజనం పెట్టించాలని భావించాడు. ఖర్చులు ఎంత అవుతాయో లెక్కవేశాడు. తామే అన్నం, కూరలు వండి సరఫరా చేస్తే.. ఎంత తక్కువలో తక్కువగా చూసుకున్నా రోజుకు రూ.1500 నుండి రూ.2000 వరకు ఖర్చు అవుతుంది. అదీ 2015 నాటి మాట. ఇప్పుడు ఖర్చులు ఇంకా పెరగవచ్చు. అయినా ఆ సమయంలో అజహర్ అవేవీ ఆలోచించలేదు. ఒక సంవత్సరం పాటు అయ్యే ఖర్చు ఎంత అవుతుందో లెక్క వేసుకున్నారు. తన సంపాదన నుండి ఆ ఖర్చును భరించగలనని ఆయన భావించాడు.
అంతే.. ఇంకేమీ ఆలోచించలేదు. కనీసం రోజుకు 400 మందికి ఆహారం అందించాలని ఆయన నిర్ణయించుకున్నాడు. గత కొన్ని సంవత్సరాలుగా ఆయన హైదరాబాద్ నగరంలో అలా అన్నార్తుల ఆకలిని తీరుస్తున్నాడు. కానీ కొన్ని సందర్భాల్లో జనాల సంఖ్య పెరిగితే ఆయనకు కష్టమయ్యేది. అనుకున్న సంఖ్య కంటే ఎక్కువ జనాభా వస్తే.. వారిని ఆకలితో వెనుతిరిగి పంపాలంటే బాధగా ఉండేది. అందుకే ఈ విషయాన్ని తోటి వ్యాపారస్తులైన తన మిత్రులతో పంచుకున్నారు. ఈ క్రమంలో కూరలతో పాటు పప్పు, అన్నం ఒక్కొక్కరు స్పాన్సర్ చేయడానికి ముందుకొచ్చారు.
దీంతో అజహర్కి కొంచెం భారం తగ్గింది. ఆ తర్వాత మరి కొందరు మిత్రులు ఆయనకు చేయూతనివ్వడంతో.. ఈ సేవా కార్యక్రమాన్ని బెంగళూరు, రాయచూర్, జార్ఖండ్, అస్సాం ప్రాంతాల్లో కూడా మొదలుపెట్టారు. ప్రస్తుతం అన్ని ప్రాంతాల్లో కలిపి దాదాపు 1000 నుండి 1500 మందికి ఆకలి తీరుస్తున్నామని ఈ సందర్భంగా అజహర్ తెలిపారు.