కోరుకున్న ప్రదేశంలోనే పెళ్లి చేసుకున్న దీపికా పదుకునే, రణ్‌వీర్ సింగ్

మొత్తంగా ఒక ఇంటివారైన దీపికా పదుకునే, రణ్‌వీర్ సింగ్

Last Updated : Nov 14, 2018, 09:59 PM IST
కోరుకున్న ప్రదేశంలోనే పెళ్లి చేసుకున్న దీపికా పదుకునే, రణ్‌వీర్ సింగ్

బాలీవుడ్ ప్రేమ జంట రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకునే ఇద్దరూ ఎట్టకేలకు ఒక ఇంటి వారయ్యారు. గత కొన్నేళ్లుగా ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకుంటున్న ఈ ప్రేమ జంట ఇవాళ ఇరు కుటుంబాల పెద్దలు, అతికొద్ది మంది సన్నిహిత మిత్రుల మధ్య కొంకని సంప్రదాయంలో పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. దీపికా పదుకునే, రణ్‌వీర్ సింగ్ ఎంతో ఇష్టపడి కోరుకున్న ఇటలిలోని చారిత్రక ప్రదేశం లేక్ కొమొ ప్రదేశమే వీళ్ల పెళ్లికి వేదికైంది. ఈ పెళ్లితో అమితాబ్ బచ్చన్-జయాబచ్చన్, అభిషేక్ బచ్చన్-ఐశ్వర్యారాయ్ బచ్చన్, అజయ్ దేవ్‌గన్-కాజోల్, అక్షయ్ కుమార్-ట్వింఖిల్ ఖన్నా, విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ వంటి బాలీవుడ్ స్టార్ కపుల్స్ జాబితాలో రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకునే కూడా చేరిపోయారు. 

దీపికా పదుకునే, రణ్‌వీర్ సింగ్ ఇద్దరూ లేక్ కొమొను అంతగా ఇష్టపడటానికి కారణం ఆ ప్రదేశం అందమైనదే కాకుండా దాదాపు 800 ఏళ్ల చరిత్ర కలిగిన చారిత్రక ప్రదేశం కూడా. అందుకే ఆ జంటకు లేక్ కొమొ అంటే చాలా ఇష్టం. ఇవాళ దీపికా పదుకునే, రణ్‌వీర్ సింగ్ పెళ్లి నేపథ్యంలో అక్కడి పోలీసులు లేక్ కొమొ విల్లాకు భారీ బందోబస్తు కల్పించారు. విల్లా చుట్టుపక్కలకు ఎవ్వరిని అనుమతి లేనిదే లోపలికి వెళ్లకుండా గట్టి భద్రతా చర్యలు తీసుకున్నారు.

Trending News