న్యూఢిల్లీ : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని ఉపాధి హామీ కూలీలకు ఇకపై దినసరి వేతనం పెంచుతున్నట్టు కేంద్రం ప్రకటించింది. ఇప్పటివరకు ఉపాధి హామీ కూలీలకు దినసరి వేతనం రూ.205గా ఉండగా.. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఆ మొత్తాన్ని మరో ఆరు రూపాయలు పెంచి రూ.211గా నిర్ణయించినట్టు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ స్పష్టంచేసింది. కూలీల గరిష్ట, కనిష్ట దినసరి వేతనం విషయానికొస్తే, హరియాణాలో గరిష్ఠంగా రూ.284, కనిష్ఠంగా బిహార్, జార్ఖండ్‌లలో రూ.171 చెల్లించనున్నట్టు కేంద్రం పేర్కొంది.
ఎప్పటికప్పుడు ప్రతీ ఆర్థిక సంవత్సరం సవరించిన వేతనాలను ప్రకటించే కేంద్రం ఈసారి కూడా యధావిధిగా సవరించిన నూతన వేతనాలను వెల్లడించే క్రమంలోనే ఈ ప్రకటన చేసింది. అయితే, అంతకన్నా ముందుగా ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల కోడ్ అమలులో వున్న నేపథ్యంలో ఈ ఏడాది వేతనాల పెంపు ప్రకటన వివరాలను ఎన్నికల సంఘానికి కేంద్రం వివరించింది. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి అనుమతి పొందిన తర్వాతే కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఈ ప్రకటనను విడుదల చేసింది.