ముంబై: ప్రముఖ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో మరో కొత్త బిజినెస్ ప్రారంభించింది. న్యూస్ మార్కెట్‌లో అత్యధిక ఆధరణ కలిగిన మొబైల్ న్యూస్ యాగ్రిగేటర్ వ్యాపారంలోకి రిలయన్స్ జియో కాలుమోపింది. జియో న్యూస్ అనే వెబ్ ఆధారిత మొబైల్ యాప్‌ని లాంచ్ చేసిన రిలయన్స్ జియో.. న్యూస్ యాగ్రిగేటర్స్ రంగంలోనూ తన సత్తా చాటుకోవాలనుకుంటోంది. బ్రేకింగ్ న్యూస్, లైవ్ టీవీ, వీడియోలు, మ్యాగజైన్స్, వార్తాపత్రికలు వంటి సకల సమాచారాన్ని ఈ జియోన్యూస్ ద్వారా యూజర్స్‌కు అందుబాటులోకి తీసుకురానున్నట్టు రిలయన్స్ జియో ప్రకటించింది. గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్‌లోనూ ఈ జియో న్యూస్ మొబైల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సంస్థ పేర్కొంది.
12కిపైగా భారతీయ భాషల్లో వార్తా సమాచారం ఈ మొబైల్ యాప్‌లో అందుబాటులో ఉంటుంది. భారత్‌తో పాటు ప్రపంచం నలుమూలల నుంచి 150కిపైగా లైవ్ న్యూస్ ఛానెల్స్, 800 మ్యాగజైన్స్, 250 న్యూస్ పేపర్స్, బ్లాగ్స్, న్యూస్ వెబ్‌సైట్స్ జియో న్యూస్‌లో వీక్షించవచ్చు, చదువుకోవచ్చు. రాజకీయాలు, క్రీడలు, వినోదం, వాణిజ్యం, సాంకేతిక పరిజ్ఞానం, లైఫ్ స్టైల్, ఆరోగ్యం, ఫ్యాషన్, కెరీర్, జ్యోతిష్యం, ఆర్థికపరమైన అంశాల్లో ఆసక్తి కలిగిన వాటిని తొలి ప్రాధాన్యతగా ఎంచుకునే వెసులుబాటు కూడా ఉంది.
జియో ప్రీమియం యూజర్స్ కి ఈ జియో న్యూస్ యాప్ లోని అన్ని ఫీచర్లు వినియోగించుకునేందుకు వీలు ఉండగా జియో యూజర్స్ కాని వారికి ట్రయల్ పీరియడ్ లో ఉన్నంత కాలం లాగిన్ అయి అన్ని ఫీచర్లను ఉపయోగించుకోవచ్చని సంస్థ స్పష్టంచేసింది.