ఛాప్రా: క్షణికావేశంలో ఒక్కోసారి మనిషి విచక్షణ కోల్పోతున్నాడు. తాను ఏం చేస్తున్నాడో తెలియకుండానే చిన్నచిన్న కారణాలకే ఘర్షణ పడి ఎదుటి వారిపై మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నాడు. తాజాగా బీహార్లోని చాప్రా జంక్షన్ వద్ద పవన్ ఎక్స్ప్రెస్ రైలులోనూ అటువంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. రైలులో సీటు కోసం తలెత్తిన వివాదం కాస్తా ఘర్షణగా మారి ఓ యువకుడి ప్రాణాలు తీసేవరకు వెళ్లింది.
దర్భంగా నుంచి ముంబైకి బయల్దేరిన పవన్ ఎక్స్ప్రెస్లో ఒక యువకుడు తన సోదరుడితో కలిసి బతుకుదెరువు నిమిత్తం ముంబైకి వెళుతున్నాడు. ఈ క్రమంలోనే వారితో ప్రయాణిస్తున్న తోటి ప్రయాణికుడితో ఈ ఇద్దరికీ సీటు విషయమై వివాదం చోటుచేసుకుంది. తొలుత సర్దిచెప్పుకుని కూర్చోవడంతో వివాదం కాస్తా సద్దుమణిగినట్టే అనిపించినా.. కాసేపటి తర్వాత ఆ యువకుడు బతుకుదెరువు నిమిత్తం ముంబైకి వెళ్తున్న యువకుడితో మళ్లీ ఘర్షణకు దిగాడు. అంతటితో ఆగకుండా తన వద్ద వున్న చాకుతో ఆ యువకునిపై దాడికి పాల్పడి హత్య చేశాడు.
ఈ ఘటనపై భయాందోళనకు గురైన తోటి ప్రయాణికులు వెంటనే రైలుని ఆపి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనపై కేసు నమోదు చేసిన జీఆర్పీ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.