HYDRAA Unstoppable: చెరువులు, కుంటలను ఆక్రమించి నిర్మించిన వాటిపై వెనక్కి తగ్గేదే లేదని రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా హైడ్రాను ఆపేది లేదని స్పష్టం చేశారు. అదొక పవిత్ర కార్యమని.. దాని వెనుక ఎలాంటి రాజకీయ కోణం లేదని పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని పబ్లిక్ గార్డెన్‌లో మంగళవారం జరిగిన ప్రజా పాలన దినోత్సవంలో రేవంత్ రెడ్డి సుదీర్ఘ ప్రసంగం చేశారు. తన ప్రభుత్వ ఘనతలు.. రాబోయే కాలంలో చేపట్టే కార్యక్రమాలు.. పనుల విషయమై వివరించారు. ఈ సందర్భంగా హైడ్రాపై కీలక వ్యాఖ్యలు చేశారు.
Also Read: Balapur Laddu: బాలాపూర్ లడ్డూ గెలిస్తే కొంగు బంగారమే! వేలం విజేతల జాబితా ఇదే!
'సెప్టెంబర్ 17 తెలంగాణ ప్రస్థానంలో అత్యంత కీలకమైన రోజు. ఈ దినోత్సవంపై ఎన్నో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అమరుల త్యాగాలను పలుచన చేసేలా ప్రవర్తించడం సరికాదని భావించి ప్రజా కోణాన్ని జోడిస్తూ 'ప్రజా పాలన దినోత్సవం’గా నామకరణం చేశాం. తెలంగాణ భౌగోళిక స్వరూపం బిగించిన పిడికిలి మాదిరిగా ఉంటుంది. పిడికిలి పోరాటానికి సింబల్. తెతెలంగాణలో అన్ని జాతులు, అన్ని కులాలు, మతాలు కలిసికట్టుగా ఉంటాయన్న సందేశం ఇందులో ఇమిడి ఉంది. ఈ ఐక్యత, ఈ సమైక్యతను దెబ్బతీసే విధంగా సెప్టెంబర్ 17ను కొందరు వివాదాస్పదం చేసే ప్రయత్నం చేయడం క్షమించరాని విషయం.
Also Read: Revanth Reddy: వచ్చే పదేళ్లు అధికారం మాదే! రాహుల్‌ను ప్రధాని చేయడమే లక్ష్యం: రేవంత్ రెడ్డి
'బిగించిన పిడికిలి కొండలనైనా పిండి చేయగలదు. ఐక్యంగా, సమైక్యంగా ఉండే తెలంగాణకు బిగించిన పిడికిలికి ఉన్నంత శక్తి ఉంది. ఇది నాలుగు కోట్ల ప్రజల పిడికిలి. పెత్తందార్లపై, నియంతలపై ఈ పిడికిలి ఎప్పటికీ పోరాట సంకేతంగా ఉండాలి' అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తమ ఆలోచన, ఆచరణ ప్రతీది ప్రజా కోణమేనని తెలిపారు. ప్రాణ త్యాగాలతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో పాలన పారదర్శకంగా ఉండాలని చెప్పారు,
తాను అధికారంలోకి రాగానే సాంస్కృతిక పునరుజ్జీవనానికి నాంది పలికినట్లు రేవంత్ తెలిపారు. తెలంగాణ పేరు మార్పు అక్షరాల మార్పు కాదని ప్రజల ఆకాంక్షల తీర్పని పేర్కొన్నారు. డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ అంగరంగ వైభవంగా జరపబోతున్నామని ప్రటకించారు. గద్దర్ పేరుతో సినిమా అవార్డులు, కోఠిలోని మహిళా విశ్వవిద్యాలయానికి చాకలి ఐలమ్మ పేరు పెట్టుకున్నట్లు వివరించాఉ. కేంద్రం నుంచి మన హక్కుగా రావాల్సిన ప్రతి పైసా తెచ్చుకోవడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు.
తన ఢిల్లీ పర్యటనల మీద కొందరు విమర్శలు చేస్తున్నారు. కాలు కదపకుండా ఇంట్లో సేద తీరనని.. తాను పని చేసే ముఖ్యమంత్రినని రేవంత్ రెడ్డి చెప్పుకున్నారు. పర్యావరణ పునరుజ్జీవనం కూడా జరగాల్సిన అవసరం ఉందని గుర్తుచేశారు. ఈ క్రమంలోనే హైడ్రాను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. చెరువులు, నాలాలు కాపాడుకోకపోతే భవిష్యత్ తరాలు భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
పవిత్ర కార్యం
'హైడ్రా వెనుక రాజకీయ కోణం లేదు. స్వార్థం లేదు. అదొక పవిత్ర కార్యం. ప్రకృతిని కాపాడుకునే యజ్ఞం. దీనికి ప్రతి ఒక్కరు సహకరించాలి' అని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కొందరు భూ మాఫియాగాళ్లు పేదలను ముందు పెట్టి హైడ్రా లక్ష్యాన్ని నీరుగార్చే ప్రయత్నంలో ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా హైడ్రా ఆగదని స్పష్టం చేశారు. హైదరాబాద్ భవిష్యత్‌కు హైడ్రా గ్యారెంటీ ఇస్తుందని పేర్కొన్నారు. 'ఇది నా భరోసా. ప్రజలు సహకరించాల్సిందిగా కోరుతున్నా' అని విజ్ఞప్తి చేశారు.
ఇల్లు ఇస్తాం
'ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా ఈ ఏడాది 4,50,000 ఇళ్లు నిర్మించబోతున్నాం. ప్రతి ఇంటి నిర్మాణానికి ఈ పథకం ద్వారా రూ.5 లక్షలు ఆర్థిక సాయం చేయబోతున్నాం. స్థలం లేని వారికి స్థలం కూడా ఇవ్వాలన్న ఆలోచన చేస్తున్నాం' అని రేవంత్ రెడ్డి తెలిపారు. నిరుద్యోగుల భవిష్యత్‌కు భరోసానిచ్చే ప్రయత్నం మొదలైందని పేర్కొన్నారు. మేనిఫెస్టోలో చెప్పినట్లుగా మరణించిన గల్ఫ్ కార్మికుల కుటుంబానికి రూ.5 లక్షలు ఇస్తామని ప్రకటించారు. తెలంగాణ సర్వతోముఖాభివృద్ధికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.