MLA Sudheer Reddy Vs MLC Rama Subbareddy: కడప జిల్లా జమ్మల మడుగులో వైసీపీకి పంచాయతీకి జగన్ పుల్‌స్టాప్ పెట్టారు. జమ్మల మడుగులో గత కొద్దిరోజులుగా ఎవరికి వారే అన్నట్టుగా ముందుకు వెళ్తున్న మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి మధ్య సయోధ్య కుదిర్చారు. తాజాగా కడప జిల్లా పర్యటనలో ఉన్న వైసీపీ అధినేత జగన్.. ఇద్దరినీ పిలిపించి సయోధ్య చేసి పంపినట్టు తెలుస్తోంది. ఇద్దరు నేతలకు జమ్మల మడుగును చెరో మూడు మండలాలు తీసుకుని పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని ఆదేశించినట్టు తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఇద్దరు నేతలు జమ్మల మడుగును ఎలా ముందుకు తీసుకెళ్తారు. కింది శ్రేణి క్యాడర్‌ను ఎలా కలుపుకుపోతారు అనేది ఆసక్తి కరంగా మారింది.
Also Read: CM Revanth Reddy: తెలంగాణ నుంచే నరేంద్రమోదీపై యుద్ధం.. సీఎం రేవంత్ రెడ్డి ఫైరింగ్ స్పీచ్
జమ్మలమడుగు నియోజకవర్గానికి రాజకీయంగా ప్రత్యేక స్థానం ఉంది. ఫ్యాక్షన్ నియోజకవర్గంగా పేరున్న ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలవడం అంటే అంత ఆషామాషీ విషయం కాదు.. అలాంటిది మైసూరా రెడ్డి వారసుడిగా ఎన్నికల బరిలో నిలిచి 2019 ఎన్నికలలో అఖండ విజయం సాధించారు డాక్టర్ సుధీర్ రెడ్డి. ఆ తర్వాత అధికార పార్టీ ఎమ్మెల్యేగా జమ్మలమడుగు నియోజకవర్గంలో తనదైన శైలిలో హవాను కొనసాగించారు. అప్పటివరకు ఎవరికీ తెలియకపోయినా కేవలం వైఎస్ కుటుంబంతో ఉన్న సాన్నిహిత్యంతో ఎమ్మెల్యే సీటు దక్కించుకొని ఎమ్మెల్యేగా గెలిచారు సుధీర్ రెడ్డి. కానీ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత డాక్టర్ సుధీర్ రెడ్డి నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారు. ఇదే సమయంలో జమ్మలమడుగులో ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి రాజకీయంగా యాక్టివ్ కావడంతో ఇద్దరు నేతల మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరుకుంది..
కొద్దిరోజులుగా జమ్మలమడుగులో సుధీర్ రెడ్డి వర్సెస్- ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డిగా మారిపోయింది. ఈ విషయంలో ఇద్దరు నేతలు తగ్గకపోవడంతో ఈ వివాదం పార్టీ హైకమాండ్ వద్దకు చేరుకుంది. అసలే జగన్ రెడ్డి సొంత జిల్లాలోని నియోజకవర్గం కావడంతో వివాదానికి జగన్ ముగింపు పలకాలని భావించారు. ఇందులో భాగంగానే జమ్మలమడుగులో చెరో మూడు మండలాలు పంచుకోవాలని చెప్పడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే అధినేత జగన్ చేసిన ప్రతిపాదనను మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అంగీకరించలేదని తెలుస్తోంది. దీంతో ఒకానొక దశలో క్యాంపు కార్యాలయం సుధీర్ రెడ్డి బయటకు వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది.
ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తీరుపై అధినేత జగన్ తీవ్ర అసంతృప్తి వెళ్లగక్కినట్టు తెలుస్తోంది. తన తీరు మారకపోతే ఆ మూడు మండలాలు కూడా ఉండవని మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని జగన్ హెచ్చరించినట్టు సమాచారం. ప్రస్తుతం ముద్దనూరు, కొండాపురం, ఎర్రగుంట్ల మండలాలు సుధీర్ రెడ్డికి అప్పగించారట. అటు జమ్మలమడుగు, పెద్దముడియం, మైలవరం మండలాలు రామసుబ్బారెడ్డి కి అప్పగించినట్టు తెలుస్తోంది. అయితే కడప ఎంపీ అవినాష్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడి అనుమతి లేకుండా రామసుబ్బారెడ్డికి కేటాయించిన మండలాల్లో కార్యక్రమాలు చేయద్దని సుధీర్ రెడ్డికి స్ట్రాంగ్ వార్నింగ్ సైతం ఇచ్చినట్టు తెలుస్తోంది.
మొత్తంగా జమ్మలమడుగు పంచాయతీకి ఫుల్ స్టాప్ పెట్టామని అధినేత భావిస్తున్నారు. కానీ ఇప్పుడే అసలైన రాజకీయం మొదలైందనే చర్చ పార్టీలో జరుగుతోందట. ఒకే నియోజకవర్గంలో ఇద్దరు నేతలు కలిసి నడుస్తారా..! లేదంటే.. ఒకరి మండలాల్లో మరొకరు వేలుపెట్టి రాజకీయాలను మరింత రక్తి కట్టిస్తారా అనేది తెలియాల్సి ఉంది.. మరోవైపు ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డికి ఫ్రీ హ్యాండ్ ఇస్తూనే సుధీర్ రెడ్డిపై లేని ఆంక్షలు పెట్టడంపైన ఆయన అనుచరులు తీవ్రంగా రగిలిపోతున్నారట. చూడాలి మరి అధినేత మాటకు ఇద్దరు నేతలు గౌరవిస్తారా లేదంటే ఎవరి దారి వారిదే అన్నట్టుగా వ్యవహారిస్తారా అనేది తెలియాలంటే కొద్దిరోజులు వేచి చూడాల్సిందే..!
Also Read: Free Gas Cylinder: మహిళలకు దీపావళి పండుగే.. ఉచిత గ్యాస్ సిలిండర్లకు చెక్కు అందజేత
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.