బనస్కాంత్ (గుజరాత్): నరేంద్ర మోదీ మష్రూమ్స్ (పుట్టగొడుగులు) కొరకు 80,000 రూపాయలు ఖర్చు చేస్తున్నారని గుజరాత్ కాంగ్రెస్ పార్టీ మిత్రపక్ష నాయకుడు అల్పేష్ థాకోర్ ఆరోపించారు. గుజరాత్లో రెండో దఫా ఎన్నికలు జరుగుతున్న తరుణంలో చివరిరోజు ఎన్నికల ర్యాలీలో ఆయన పై విధంగా స్పందించారు.
గుజరాత్లోని వాద్గావ్లో జరిగిన ఒక సమావేశంలో థాకర్ మాట్లాడుతూ- "మోదీజీ తింటున్న ఆహారం నువ్వు తినలేవని నాకు కొందరు చెప్పారు. ఎందుకు తినలేనని ప్రశ్నిస్తే.. అది పేదలకు అందని ఆహారం అని చెప్పారు' అని అన్నారు. తైవాన్ నుండి మోదీ కొన్ని ప్రత్యేకమైన పుట్టగొడుగులను తెప్పించుకుంటారని అన్నారు.
"ఒక పుట్టగొడుగు ధర రూ.80,000. ఒకటైతే ఏమోలే అనుకోవచ్చు.. కానీ ఆయన రోజూ ఐదు పుట్టగొడుగులను తింటారు. ఇందుకయ్యే ఖర్చు ఆయన నెలసరి జీతం కంటే ఎక్కువ " అని థాకర్ ఎద్దేవా చేశారు. 2001లో గుజరాత్ ముఖ్యమంత్రి అయినప్పటి నుండీ ప్రధానమంత్రి మోదీ ఆ పుట్టగొడుగులను తింటున్నారని.. అందుకే ఆయన చర్మం అంత మృదువుగా ఉంటుందని థాకరే తెలిపారు