తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ని పలు టీవీ ఛానెల్స్ అయోమయానికి గురిచేశాయి. నేడు గుజరాత్, హిమాచల్ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ జరుగుతుండటంతో కౌంటింగ్ అప్ డేట్స్, ప్రత్యక్ష ప్రసారాల కోసం యావత్ దేశం ఉదయం నుంచే టీవీలకి అతుక్కుపోయింది. అలాగే మంత్రి కేటీఆర్ కూడా టీవీ ముందు కూర్చుని గుజరాత్ లో చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలపై అదే పనిగా పరిశీలించడం మొదలుపెట్టారు.
ఇదే క్రమంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల ఆధిక్యంపై ఒక్కో టీవీ ఛానెల్ ఒక్కో రకమైన ఫలితాన్ని వెల్లడిస్తోందని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా తన అయోమయాన్ని వ్యక్తపరిచారు. ఏ పార్టీ వాళ్లు, ఏ నియోజకవర్గంలో, ఎంత ఆధిక్యంలో ఉన్నారనే అంశంపై ఒక్కో టీవీ ఛానెల్ ఒక్కోరకమైన సంఖ్యలని ఇవ్వడం తనని కన్ ఫ్యూజ్ చేస్తోందన్న మంత్రి గారు... `అభిప్రాయాల్లో తేడాలు ఉంటాయని అర్థం చేసుకోగలను కానీ, సంఖ్యల్లో తేడా ఉండకూడదు కదా` అని ట్విటర్ ద్వారా తన సందేహాన్ని వెలిబుచ్చారు.