Arnab Goswami Arrest: ప్రతీకారం కాదు, చట్ట ప్రకారమే చేశామన్న సంజయ్‌ రౌత్‌

Sanjay Raut On Arnab Goswami Arrest | అర్నాబ్ గోస్వామిని అరెస్ట్ చేయడం దుమారం రేపుతోంది. ముంబై పోలీసులు అర్నాబ్‌ను అరెస్ట్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ సైతం విమర్శలు గుప్పించారు. అర్నాబ్ అరెస్ట్ అక్రమమని, అన్యాయమని మహారాష్ట్ర ప్రభుత్వం తీరుపై మండిపడుతున్నారు. ఈ విమర్శలపై శివసేన కీలక నేత సంజయ్ రౌత్ స్పందించారు.

Last Updated : Nov 4, 2020, 03:56 PM IST
  • అర్నాబ్ గోస్వామిని అరెస్ట్ చేయడం దుమారం రేపుతోంది
  • ఎమర్జెన్సీలో ఉన్నారా ఏంటని కేంద్ర మంత్రుల విమర్శలు
  • చట్ట ప్రకారమే అని చెప్పిన శివసేన నేత సంజయ్ రౌత్
Arnab Goswami Arrest: ప్రతీకారం కాదు, చట్ట ప్రకారమే చేశామన్న సంజయ్‌ రౌత్‌

రిపబ్లిక్ టీవీ చీఫ్ ఎడిటర్ అర్నాబ్ గోస్వామిని అరెస్ట్ చేయడం దుమారం రేపుతోంది. ముంబై పోలీసులు (Mumbai Police) అర్నాబ్‌ను అరెస్ట్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ సైతం విమర్శలు గుప్పించారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఇంకా ఎమర్జెన్సీ కాలంలో ఉన్నామని భావిస్తున్నారేమోనంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మరికొందరు కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు అర్నాబ్ అరెస్ట్ అక్రమమని, అన్యాయమని మహారాష్ట్ర ప్రభుత్వం తీరుపై మండిపడుతున్నారు. ఈ విమర్శలపై శివసేన కీలక నేత సంజయ్ రౌత్  (Sanjay Raut) స్పందించారు.

 

చట్ట ప్రకారమే ముంబై పోలీసులు అర్నాబ్ గోస్వామిని అరెస్ట్ చేశారని పేర్కొన్నారు. తప్పు చేసింది ఎవరైనా అరెస్ట్ చేసే అధికారం పోలీసులకు ఉందన్నారు. బాలీవుడ్ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసు, దర్యాప్తు, టీఆర్పీ రేటింగ్ లాంటి అంశాల కేసులో అర్నాబ్‌ను అరెస్ట్ చేశామనడం సరికాదని సూచించారు. మహారాష్ట్రలో ఠాక్రే అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకూ ఒక్కరిని కూడా ఉద్దేశపూర్వకంగా అరెస్ట్ చేయలేదని చెప్పారు.

 

2018లో జరిగిన ఇంటీరియర్ డిజైనర్ ఆత్మహత్య కేసులో అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఇంటీరియర్ డిజైనర్ అన్వయ్ నాయక్, ఆయన తల్లి ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించారన్న కేసులో రిపబ్లిక్ టీవీ చీఫ్ ఎడిటటర్ అర్నాబ్ గోస్వామిని ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారని వివరించారు. కాగా, అర్నాబ్‌తో పాటు మరో ఇద్దరు వ్యక్తులు తనకు చెల్లించాల్సిన రూ.5.40 కోట్లు ఇవ్వకుండా మోసం చేశారని తన సూసైడ్ నోట్‌లో ఇంటీరియర్ డిజైనర్ రాశాడు. డబ్బులు సకాలంలో అందక ఆర్థికంగా నష్టపోయి ఆత్మహత్య చేసుకున్నానని ఆ నోట్‌లో వివరాలు ఉన్నాయి.

Trending News