Padmanabhaswamy Temple: ప్రపంచంలోని ధనిక దేవాలయంగా గుర్తింపు పొందిన తిరువనంతపురంలోని శ్రీ పద్మనాభస్వామి ఆలయం(Padmanabhaswamy Temple) ఆర్ధిక సంక్షోభంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా ఆ ఆలయ పరిపాలనా కమిటినే సుప్రీంకోర్టు(Supreme Court) దృష్టికి తీసుకువెళ్లింది. ప్రతి నెలా ఆలయ నిర్వహణ, స్వామివారి ధూపదీప నైవేద్యాలు, కైంకర్యాలు, సేవలు వంటి వాటి ఖర్చులకు రూ.1.25 కోట్లు అవసరముంటుందని తెలిపింది. కానీ ఆలయానికి 60 నుండి 70 లక్షల రూపాయల వరకు మాత్రమే ఆదాయం వస్తున్నట్లు పద్మనాభస్వామి ఆలయ పరిపాలన కమిటీ సర్వోన్నత న్యాయస్థానానికి వివరించింది. ఈ కేసును న్యాయమూర్తులు జస్టిస్ యు.యు.లలిత్, జస్టిస్ ఎస్.రవీంద్ర భట్, జస్టిస్ బేలా ఎం త్రివేదిలతో కూడిన ధర్మాసనం విచారణ జరుపుతోంది.
ట్రస్ట్ వ్యవహారాలపై ఆడిట్ జరిపించాలి...
ట్రావెన్కోర్ రాజకుటుంబీకులు నిర్వహిస్తున్న ట్రస్టు నుంచి శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయానికి నిధులు అందేలా చూడాలని కోరింది. అలాగే రాజకుటుంబీకుల ఆధీనంలో ఉన్న శ్రీ పద్మనాభస్వామి దేవాలయ ట్రస్ట్ వ్యవహారాలపైనా ఆడిట్ జరిపించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఆలయం ఆర్థిక సంక్షోభంలో ఉన్నట్లు పరిపాలన కమిటీ తరపు న్యాయవాది సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
2013 సంవత్సరం నాటి ఆడిట్ ప్రకారం చూస్తే.. ట్రస్టు దగ్గర రూ. 2.87 కోట్లు నగదు, రూ. 1.95 కోట్లు విలువజేసే ఆస్తులున్నట్టు ఆలయ పరిపాలన కమిటీ న్యాయవాది తెలిపారు. ఆలయ ఆస్తులన్నీ ఎంత వరకు ఉన్నాయనేది తెలుసుకోవడానికే ఆడిట్ జరగాల్సిన అవసరముందని వాదించారు.
ఆలయ కమిటీ జోక్యానికి ఆంగీకరించేది లేదు..
కాగా, ఈ వాదనలను ట్రావెన్కోర్ రాజకుటుంబీకులు నిర్వహిస్తున్న ట్రస్ట్ తరఫు లాయర్ అరవింద్ దాతర్ తోసిపుచ్చారు. ఆలయ పరిపాలన తోపాటు రోజువారీ వ్యవహారాలతో ట్రస్ట్‌కు సంబంధం లేదనీ, అందులో ట్రస్ట్ పాత్ర కూడా లేదని అన్నారు. అలాగే ఆడిట్ చేయించాల్సిన పనిలేదని కూడా చెప్పారు. అసలు ట్రావెన్కోర్ ట్రస్ట్ వ్యవహారాల్లో ఆలయ కమిటీ జోక్యానికి, పర్యవేక్షణకు అంగీకరించేది లేదని తేల్చిచెప్పారు. ఐటీ చట్టం నిబంధనల ప్రకారం కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. దేవాలయ ఆదాయ, వ్యయాలపై పాతిక ఏళ్ల ఆడిట్‌ను నిర్వహించాలని గతేడాది జారీచేసిన ఉత్తర్వులనుంచి ట్రస్ట్‌ను మినహాయించాలని కోరారు.
ఆలయ ఆస్తి ఎంత?
పద్మనాభస్వామి ఆలయం కేరళ(Kerala) రాజధాని తిరువనంతపురం(thiruvananthapuram)లో ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యంత ధనిక ఆలయంగా గుర్తింపు సాధించింది. ఆలయంలో ఉన్న మొత్తం నిధి విలువ 1 ట్రిలియన్ డాలర్ల కంటే ఎక్కువ. దీని అర్థం అనేక చిన్న దేశాల ఆర్థిక వ్యవస్థకు సమానం. ఈ మహా దేవాలయాన్ని 18 వ శతాబ్దంలో ట్రావెన్కోర్ రాజ కుటుంబం పునర్నిర్మించినట్లు చెబుతారు. 1947 ఇండియన్ యూనియన్‌లో విలీనానికి ముందు ట్రావెన్ కోర్ రాజ కుటుంబం దక్షిణ కేరళ, తమిళనాడులోని కొన్ని ప్రాంతాలను పాలించేవారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా దేవాలయం బాధ్యతను ఆ వంశస్థులే నిర్వహించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి