Lanino Effect: చలికాలం ఈసారి భారీ హెచ్చరికలు చేస్తోంది. మున్ముందు గజగజ వణికించే పరిస్థితి వస్తుందనే వార్తలు కలవరం రేపుతున్నాయి. ఉత్తరాదిన ఉష్ణోగ్రత ఈసారి భారీగా పడిపోనుందా, అసలేం జరగనుంది, ఎందుకీ హెచ్చరికలు. జస్ట్ హ్యావ్ ఎ లుక్
ప్రతి యేటా వాతావరణం మారిపోతోంది. వేసవైనా, వర్షాకాలమైనా, చలికాలమైనా సరే. ఒక్కోసారి అన్నీ తీవ్రంగానే ఉంటున్నాయి. ముఖ్యమంగా చలికాలం విషయంలో వాతావరణ నిపుణుల హెచ్చరికలు ఆందోళన కల్గిస్తున్నాయి. నవంబర్ రాకుండానే ఉత్తరాదిన చలి ప్రారంభమైపోయింది. ఉత్తర భారతదేశంలోని రాష్ట్రాలు మున్ముందు గజగజ వణికిపోక తప్పదని హెచ్చరికలు వస్తున్నాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతాయని..మంచు భారీగా కురుస్తుందని వాతావరణ శాఖ చెబుతోంది. లానినోనే ఈ పరిస్థితికి కారణమని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. అసలు లానినో అంటే ఏంటనేది తెలుసుకుందాం.
సాధారణంగా ఎల్‌నినో(Elnino), లానినో(Lanino)పరిస్థితులు ఏర్పడినప్పుడు దేశంలో నైరుతి, ఈశాన్య రుతుపవనాల సీజన్లలో గణనీయంగా మార్పులు వస్తాయి. ఈసారి లానినో కారణంగా నైరుతి రుతు పవనాలు ఎక్కువకాలం కొనసాగాయి. 1975 తర్వాత ఇంత సుదీర్ఘంగా నైరుతి సీజన్ ఉండటం ఇదే తొలిసారి అని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఇండియాకు సంబంధించినంత వరకు.. ఎల్‌నినో సమయంలో ఏ సీజన్ అయినా కూడా ఉష్ణోగ్రతలు పెరగడం, వానలు తగ్గి కరువు పరిస్థితులు ఏర్పడటం జరుగుతుంది. లానినో సమయంలో ఎండాకాలంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదైనా.. వానాకాలంలో భారీ వర్షాలు, వరదలు వస్తాయి. పసిఫిక్ మహా సముద్రంపై రెండేళ్లుగా లానినో పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ ఏడాది ఆ ప్రభావం మరింతగా పెరిగింది. ఈ నేపథ్యంలోనే ఉత్తర భారత రాష్ట్రాల్లో(North States)ఉష్ణోగ్రతలు సాధారణానికి మించి నమోదయ్యాయి. ఆ తరువాత వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుంచి విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఉత్తర భారత రాష్ట్రాల్లో అక్కడక్కడా ఇప్పటికీ భారీ వర్షాలు కొనసాగుతున్నాయి.
ఇక లానినో కారణంగా పసిఫిక్ మహా సముద్రం వైపు నుంచి శీతల గాలులు వీస్తాయని.. దీనితో భూమి ఉత్తర అర్ధభాగంలో ఉష్ణోగ్రతలు పడిపోతాయని ప్రపంచ వాతావరణ సంస్థ తాజాగా ప్రకటించింది. ఇదే సమయంలో దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా ఖండంలో దిగువ భాగంలోని దేశాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతాయని పేర్కొంది. దక్షిణ, ఆగ్నేయాసియా దేశాలపై లానినో ఎక్కువగా ప్రభావం చూపుతుంది. చలి తీవ్రత పెరుగుతుంది. ఇప్పటికే ఉత్తర భారత ప్రాంతంలో చలి మొదలైందని.. చాలా ప్రాంతాల్లో మూడు డిగ్రీల సెల్సియస్ దాకా ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది.
ముఖ్యంగా డిసెంబర్ మూడవ వారం నుంచి ఫిబ్రవరి రెండవ వారం వరకు చలి(Cold)విపరీతంగా ఉంటుందని నివేదిక తెలిపింది. జమ్మూకశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే మంచు కురవడం ప్రారంభమైంది. దక్షిణ భారత రాష్ట్రాల్లోనూ సాధారణంతో పోలిస్తే.. మూడు నుంచి ఐదు డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. చైనాలోని తూర్పు ప్రాంతాల్లో ఇప్పటికే ఉష్ణోగ్రతలు పడిపోయాయని..జపాన్, దక్షిణ కొరియా దేశాల్లోనూ చలి తీవ్రత మొదలైందని.. ఆయా దేశాల వాతావరణ అధికారులు ప్రకటించడం గమనార్హం. అతిపెద్ద మహా సముద్రమైన పసిఫిక్ సముద్రం ఉపరితలంలోని నీటి ఉష్ణోగ్రతల్లో కొన్నేళ్లకోసారి హెచ్చుతగ్గులు వస్తుంటాయి. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా సముద్ర ప్రవాహాల్లో.. ఖండాల మీదుగా వీచే పవనాల ఉష్ణోగ్రతలు, తేమ శాతంలో మార్పులు వస్తాయి. పసిఫిక్ ఉష్ణోగ్రతలు పెరగడాన్ని ఎల్నినోగా.. తగ్గడాన్ని లానినోగా పిలుస్తారు.
ఎల్‌నినోతో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు(Heavy Rains), వరదలు వస్తే.. మరికొన్నిచోట్ల వానలు తగ్గి, ఎండలు పెరిగి కరువులు ఏర్పడతాయి. అదే లానినో కారణంగా ఎల్‌నినోతో వరదలు వచ్చే చోట కరువులు వస్తాయి, ఎండలు ఉండే చోట భారీ వర్షాలు కురుస్తాయి. ఓ వైపు కరువు.. మరోవైపు వరదలు సంభవించాయి. లానినో కారణంగా దక్షిణ అమెరికా ఖండంలోని పెరూ, ఈక్వెడార్ వంటి దేశాల్లో తీవ్ర కరువు పరిస్థి తులు ఏర్పడ్డాయి. పసిఫిక్ మహా సముద్రానికి పశ్చిమాన ఉన్న దేశాల్లో, హిందూ మహాసముద్ర ప్రాంతదేశాల్లో ఉష్ణోగ్రతలు(Temperatures)కాస్త పెరిగాయి.
ప్రస్తుతం అమెరికాలో వర్షాకాలం ప్రారంభమైంది.
Also read: G-20 Summit: 2022 డిసెంబర్ నాటికి ఇండియాలో 5 వందల కోట్ల కోవిడ్ వ్యాక్సిన్ ఉత్పత్తి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి