KCR NEW PARTY: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో కొన్ని రోజులుగా హడావుడి చేస్తున్నారు. కొత్త పార్టీ పెట్టబోతున్నట్లుగా కూడా ప్రకటించారు. నెలాఖరులో అధికారికంగా జాతీయ పార్టీ ప్రకటన చేయబోతున్నారని తెలుస్తోంది. బీజేపీ, కాంగ్రెస్ కు వ్యతిరేకంగా తమ పార్టీ ఉంటుందని చెబుతున్న కేసీఆర్.. పార్టీ విధివిదానాలు, జెండా రూపకల్పనపై కసరత్తు చేస్తున్నారు. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో కలిసి కేసీఆర్ సమాలోచనలు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా తనకు కలిసి వచ్చే పార్టీలతో కలిసి ముందుకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాలకు వెళ్లి చర్చలు జరిపారు కేసీఆర్. పార్టీ ప్రకటన తర్వాత మరికొందరు నేతలను కలుస్తారని తెలుస్తోంది.
అయితే బీజేపీనే తమ టార్గెట్ అంటున్న కేసీఆర్.. తాజాగా తీసుకున్న ఓ నిర్ణయం దేశవ్యాప్తంగా చర్చగా మారింది. త్వరలో జరగనున్న రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థికి పోటీగా బలమైన అభ్యర్థిని బరిలో నిలపాలని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్లాన్ చేస్తున్నారు. ఢిల్లీలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. 8 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు వివిధ పార్టీలకు చెందిన 22 మంది నేతలను మమత ఆహ్వానించారు. బీజేపీకి వ్యతిరేకంగా బలమైన వాయిస్ వినిపిస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఫోన్ చేసి మాట్లాడారు మమతా బెనర్జీ. ఈ సమావేశానికి కేసీఆర్ వెళతారని... కీలకంగా వ్యవహరిస్తున్నారని అంతా భావించారు. దేశంలో సంచలనం జరగబోతోందని కొంత కాలంగా చెబుతున్న కేసీఆర్.. ప్రెసిడెంట్ ఎన్నికల్లో సంచలనం చేసి చూపిస్తారా అన్న చర్చ కూడా రాజకీయ వర్గాల్లో సాగింది. అయితే అందరిని షాకింగ్ కు గురి చేస్తూ మమతా బెనర్జీ సమావేశానికి డుమ్మా కొట్టారు కేసీఆర్. ఇదే ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. బీజేపీని ఓడిస్తానంటున్న కేసీఆర్.. మమత సమావేశానికి ఎందుకు రావడం లేదన్నది ప్రశ్నగా మారిపోయింది.
మమతా బెనర్జీ సమావేశానికి కేసీఆర్ రాకపోవడానికి బలమైన కారణమే ఉందంటున్నారు. మమతా బెనర్జీ నుంచి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి కాల్ వెళ్లింది. ఆమె సమావేశానికి వస్తారని సమాచారం. ఈ కారణం వల్లే కేసీఆర్.. మమత సమావేశానికి డుమ్మా కొట్టారని అంటున్నారు. జాతీయ పార్టీ పెడతానంటున్న కేసీఆర్.. బీజేపీతో పాటు కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తున్నారు. ఈ రెండు పార్టీలతో దేశానికి నష్టమని ఆరోపిస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగానే తన జాతీయ పార్టీ పయనిస్తుందని చెప్పారు. ఇప్పుడు మమత సమావేశానికి వెళితే... కాంగ్రెస్ నేతలతో కలిసి వేదిక పంచుకోవాల్సి వస్తుంది. దీంతో జనాల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయని భావనలో కేసీఆర్ ఉన్నారని అంటున్నారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ ఒకటేనని ఇప్పటికే బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. సోనియాతో కలిసి వేదిక పంచుకుంటే బీజేపీకి ఇది అస్త్రంగా మారే అవకాశం ఉంటుంది. అందుకే తాను వెళ్లకుండా పార్టీ సీనియర్ నేత కేకేను మమతా బెనర్జీ సమావేశానికి పంపించారని అంటున్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లోనూ తన అభ్యర్థి ఉండేలా కేసీఆర్ కసరత్తు చేస్తున్నారని తెలుస్తోంది. మమతా బెనర్జీ సమావేశం తర్వాత... అక్కడి నుంచి వచ్చిన వివరాల తర్వాత కేసీఆర్ తుది నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారని చెబుతున్నారు.
Read also: WhatsApp Tips And Tricks: వాట్సాప్‌లో డిలీట్ చేసిన సందేశాలు, వీడియోలను ఇలా చూడొచ్చు.!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook