ట్రంప్‌‌పై సైనికుడి భార్య ఆగ్రహం

  

Last Updated : Oct 23, 2017, 07:05 PM IST
ట్రంప్‌‌పై సైనికుడి భార్య ఆగ్రహం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో వివాదంలో చిక్కుకున్నారు. నైజర్ ప్రాంతంలో ఇస్లామిక్ మిలిటెంట్ల చేతిలో హతమైన అమెరికా సైనికుల కుటుంబాలతో వెంటనే అధ్యక్షుడు ఫోన్‌లో ఎందుకు మాట్లాడలేదు? అని ఇప్పటికే అక్కడి మీడియా ట్రంప్‌ని ప్రశ్నిస్తోంది.

ఈ క్రమంలో సర్జెంట్ లా డేవిడ్ జాన్సన్ అనే చనిపోయిన సైనికుడి భార్యకు ఫోన్ చేసిన ట్రంప్ మళ్లీ వివాదంలో చిక్కుకున్నారు. ట్రంప్ తనకు చేసిన ఫోన్ కాల్  చాలా సాధారణంగా ఉందని... అమెరికా అధ్యక్షుడై ఉండి ట్రంప్ అసలు తనను పట్టించుకోనట్లే  మాట్లాడారని, జాన్సన్ భార్య తెలిపారు. కనీసం తన భర్త పేరును కూడా ట్రంప్ గుర్తుపెట్టుకోకుండా కాల్ చేశారని ఆమె అన్నారు.

పైగా జాన్సన్‌ మిలట్రీలో చేరబోతున్నప్పుడే.. అన్ని విషయాలు తెలుసుకొని ఒప్పందం మీద సంతకం చేసినట్లు ట్రంప్ మాట్లాడారని.. ఆ మాటలు తనను బాధించాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

అయితే ఈ విషయంపై స్పందించిన ట్రంప్ తాను ఆమెతో చాలా గౌరవంగానే మాట్లాడానని ట్విట్టర్ ద్వారా తెలిపారు. తను ఇలా చనిపోయిన సైనికుల కుటుంబాలతో మాట్లాడినట్లు, గతంలో ఏ అధ్యక్షుడు కూడా మాట్లాడలేదని ఈ సందర్భంగా ట్రంప్ అన్నారు. 

ఈ మాటలు కూడా ప్రతిపక్షాల ఆగ్రహానికి గురయ్యాయి. ఆ నేపథ్యంలో వైట్ హౌస్ ఒక ప్రకటన విడుదల చేసింది. దేశ అధ్యక్షుడు సైనికుల కుటుంబాలతో మాట్లాడే విషయాలు చాలా రహస్యమని.. వాటిని బహిర్గతం చేయకూడదని తెలిపింది. 

Trending News