Chandrababu Bhadrachalam: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం భద్రాద్రి జిల్లాలో పర్యటిస్తున్నారు. వరద ముంపు గ్రామాలను ఆయన పరిశీలించనున్నారు. ఉండవల్లిలోని తన నివాసం నుంచి విజయవాడ మీదుగా మైలవరం, తిరువూరు, పెనుబల్లి మీదుగా సత్తుపల్లి వస్తారు చంద్రబాబు. అక్కడి నుంచి అశ్వరావుపేట మీదుగా వినాయకపురం చేరుకుంటారు. విభజన సమయంలో ఏపీలో విలీనమైన వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లోని గోదావరి వరద బాధిత కుటుంబాలను పరామర్శిస్తారు. తెలంగాణ పరిధిలోని బూర్గంపాడు, సారపాకలో పర్యటిస్తారు. ఇటీవల వచ్చిన గోదావరి వరదలకు ముంపునకు గురైన ప్రాంతాలను పరిశీలిస్తారు. వరద బాధితులతో మాట్లాడి వాళ్ల సమస్యలు తెలుసుకుంటారు. తర్వాత భద్రాచలం వెళతారు. రాత్రికి భద్రాచలంలో బసచేసే చంద్రబాబు... శుక్రవారం ఉదయం శ్రీరాముడిని దర్శించుకుంటారు. గోదావరి కరకట్టను పరిశీలిస్తారు. భద్రాచలంలోని వరద బాధిత కుటుంబాలను పరామర్శిస్తారు చంద్రబాబు.
వరద బాధిత గ్రామాల్లో పర్యటిస్తున్న చంద్రబాబు.. భద్రాచలం వస్తుండటం రాజకీయంగా ఆసక్తిగా మారింది. ప్రస్తుతం తెలంగాణలో టీడీపీ పూర్తిగా బలహీనమైంది.ఒకరిద్దరు నేతలు మినహా ఎవరూ లేరు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలన్న అభ్యర్థులు దొరకడం కష్టమే. పార్టీ బలహీనంగా మారడంతో తెలంగాణ రాజకీయాలపై చంద్రబాబు పెద్ద ఆసక్తి చూపడం లేదు. అలాంటిది ఆయన వరద ముంపు బాధితులను పరామర్శించేందుకు భద్రాచలం వస్తుండటం చర్చగా మారింది. చంద్రబాబు భద్రాచలం టూర్ వెనుక పెద్ద రాజకీయ వ్యూహమే ఉందని తెలుస్తోంది. అందుకే చంద్రబాబు పర్యటనకు తమ్ముళ్లు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారని అంటున్నారు.
2003లో భద్రాచలానికి భారీగా వరద వచ్చింది. గోదావరి భద్రాచలాన్ని ముంచేసింది. గోదావరి పరివాహాక గ్రామాలన్ని నీట మునిగాయి. వందలాది ఇళ్లలోకి వరద నీరు చేరింది. వేలాది మందిని రెస్క్యూ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అప్పుడు ఉమ్మడి ఏపీకి ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నారు. గోదావరి వరద విలయం తర్వాత భద్రాచలం దగ్గర గోదావరికి కరకట్ట కట్టాలని నిర్ణయించారు. జిల్లాకు చెందిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక చొరవ తీసుకుని భద్రాచలంలో కరకట్టను పూర్తి చేశారు. కరకట్ట కట్టడంతో భద్రాచలానికి ముంపు తప్పింది. గోదావరి నీటిమట్టం 70 అడుగులకు చేరినా ప్రమాదం లేకుండా కరకట్ట కట్టారు. కరకట్ట వల్లే ఇటీవల వచ్చిన వరదల నుంచి భద్రాచలం సేఫ్ అయిందని చెబుతున్నారు. భద్రాచలంలో పర్యటించిన సీఎం కేసీఆర్ కూడా సభా వేదికగానే కరకట్ట గురించి చెప్పి తుమ్మలను అభినందించారు. వరదల సమయంలో కొందరు భద్రాచలం వాసులు చంద్రబాబుకు ఫోటోలకు పాలాభిషేకం చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను టీడీపీ సోషల్ మీడియా వైరల్ చేసింది.
తమ ప్రభుత్వ హయంలో నిర్మించిన కరకట్టే భద్రాచలానికి ముప్పు తప్పించిందని చెబుతున్న చంద్రబాబు.. ఆ విషయాన్ని జనంలోకి మరింతగా తీసుకెళ్లడానికే భద్రచాలం వెళుతున్నారని తెలుస్తోంది. వరద ప్రాంతాల పర్యటనలో భాగంగా ఆయన భద్రాచలంలో నిర్మించిన కరకట్టను పరిశీలించనున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు స్థానికులు జై కొట్టేలా టీడీపీ నేతలు ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. చంద్రబాబు కట్టిన కరకట్ట వల్లే తాము సేఫ్ గా ఉన్నామని చెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తంగా గోదావరికి తమ ప్రభుత్వం కట్టిన కరకట్టను జనాలకు చూపించడానికే చంద్రబాబు భద్రచాలం వెళుతున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.
Read also: 7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్, ఫిట్‌మెంట్‌పై త్వరలో
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook