అవును మీరు విన్నది నిజమే.. తన పెంపుడు పిల్లి ప్రేమలో పడి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకోవాలని భావించాడు. అయితే ఈ సంఘటన ఏ విదేశాల్లోనో జరగలేదు. మహారాష్ట్ర రాజధాని ముంబైలో జరిగింది. వివరాల్లోకి వెళితే మౌనిక్ అనే 22 ఏళ్ల కుర్రాడు ముచ్చటపడి ఓ పిల్లిని కొనుక్కున్నాడు. దాన్ని పెంచుకోవాలని భావించాడు. అయితే దానిని ఇంటికి తీసుకువచ్చాక పరిస్థితులు తారుమారయ్యాయి.
అతని తల్లికి పిల్లులంటే నచ్చవు. అవి అశుభానికి సంకేతమని.. అలాంటి వాటిని ఇంట్లోకి తీసుకురావద్దని ఆమె కొడుకుని బాగా తిట్టింది. ఈ క్రమంలో తల్లీ కొడుకుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. అయితే తల్లి కొడుకును తక్షణం ఆ పిల్లిని బయట వదిలేసి మాత్రమే ఇంటికి రావాలని కరాకండీగా చెప్పడంతో.. మనసు గాయపడి మౌన్విక్ పిల్లితో సహా ఇంటి నుండి వెళ్లిపోయాడు.
ఆ తర్వాత ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడు. బైక్ మీద మెరైన్ లైన్స్ స్టేషను వద్దకు వెళ్లి.. అక్కడ నుండి బ్రిడ్జి మీద నుండి కిందకు దూకేశాడు. స్థానికులు వెంటనే గాయాల బారిన పడిన ఆ యువకుడిని ఆసుపత్రికి తరలించారు. తర్వాత పోలీసులు ఆ యువకుడికి కౌన్సిలింగ్ ఇచ్చారు. అతని తల్లిని పిలిపించి కూడా విచారించారు.
అయితే ఆమె తన సంపాదన చాలా తక్కువని.. తన కొడుకుతో కలిసి బతకడానికే డబ్బులు సరిపోవడం లేదని.. అలాంటప్పుడు పెంపుడు పిల్లికి రోజూ పాలు, చికెన్ తీసుకురావాలంటే ఎలా కుదురుతుందని.. అందుకే వద్దని చెప్పానని తెలిపింది. అయితే తన కొడుకు ఇలాంటి కఠిన నిర్ణయం ఎందుకు తీసుకున్నాడో అర్థం కావడం లేదని ఆమె వాపోయింది