తెలుగుదేశం నేత, హిందుపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ శుక్రవారం తన నియోజకవర్గంలో జరిగిన మినీ మహానాడులో కర్ణాటక ఎన్నికలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆ రాష్ట్రంలోని తెలుగువారిని పొగిడారు. ఏపీ ప్రత్యేకహోదా విషయంలో గానీ, రాష్ట్రానికి అత్యవసరమైన సమయాల్లో నిధులు ఇచ్చే విషయంలో గానీ కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రమాణాలు పాటించలేదని ఆయన ఆరోపించారు.
ఈ క్రమంలో ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి కూడా హోదా కోసం తనదైన శైలిలో పోరాడుతున్న చంద్రబాబు నాయుడికి ప్రజలు తోడ్పాటునివ్వాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా బాలకృష్ణ కర్ణాటక ఎన్నికలపై కూడా పలు వ్యాఖ్యలు చేశారు. ఆ ఎన్నికల్లో తెలుగువారందరూ కూడా ఆ రాష్ట్రంలో ఏకమై మోదీ సర్కారుకి తెలుగోడి దెబ్బ అంటే ఎలా ఉంటుందో రుచి చూపించారని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్లో పలువురు నాయకులు అధికారం కోసం యాత్రలు చేస్తుండగా.. మరికొందరు నాయకులు పేరు తెచ్చుకోవడానికి యాత్రలు చేస్తున్నారని బాలకృష్ణ అన్నారు. అయినా తెలుగుదేశం పార్టీకున్న కార్యకర్తల సపోర్టు ముందు, ప్రజాబలం ముందు ఎవరు ఎన్ని యాత్రలు చేసినా, టీడీపీని ఢీకొట్టడం అసాధ్యమని తెలిపారు.