కిరణ్ కుమార్ రెడ్డితో ఉమెన్ చాందీ భేటీ

మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డితో ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ ఉమెన్ చాందీ భేటీ అయ్యారు.

Last Updated : Jul 1, 2018, 09:40 PM IST
కిరణ్ కుమార్ రెడ్డితో ఉమెన్ చాందీ భేటీ

మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డితో ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ ఉమెన్ చాందీ భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని కిరణ్ కుమార్ రెడ్డి ఇంట్లో చాందీ సమావేశమయ్యారు. కిరణ్ కుమార్ రెడ్డి సొంత పార్టీలో చేరనున్నారన్న వార్తల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.

అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనను తీవ్రంగా వ్యతిరేకించి.. కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకి వచ్చి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి 'జై సమైక్యాంధ్ర' అనే సొంత పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే. ఆతరువాత ఎన్నికల్లో ఓటమి పాలవడంతో రాజకీయాలకు దూరంగా ఉంటున్న కిరణ్ కుమార్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ గూటికి చేరనున్నారన్న వార్తలు ఇటీవలి కాలంలో వినిపిస్తున్నాయి.

కిరణ్ కాంగ్రెస్‌లో చేరడం దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే గత వారం రోజుల నుండి కాంగ్రెస్ పార్టీకి ముఖ్య నేతలు కిరణ్‌ను కలుస్తున్నారు. పల్లం రాజు, టి. సుబ్బిరామిరెడ్డి తదితరులు కిరణ్‌ను కలిసి పార్టీలోకి ఆహ్వానించారు. అంతా అనుకున్నట్లుగా జరిగితే ఈనెల 3 లేదా 4న ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సమక్షంలో కిరణ్‌ పార్టీలో చేరతారని సమాచారం.

అటు సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలు చెప్తానని హైదరాబాద్‌లోని తన నివాసంలో చాందీ భేటీలో కిరణ్ చెప్పారని తెలిసింది. కిరణ్ కుమార్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకుంటారోనని రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.

మాజీ సీఎంను కాంగ్రెస్‌లో ఆహ్వానించాం: ఉమెన్ చాందీ

మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని కాంగ్రెస్‌లోకి ఆహ్వానించినట్లు ఉమెన్ చాందీ చెప్పారు. కిరణ్ కుమార్ రెడ్డితో భేటీ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. కిరణ్ కుమార్ రెడ్డిని కాంగ్రెస్లోనికి ఆహ్వానించామన్నారు. తమ ఆహ్వానంపై ఆయన నిర్ణయం తీసుకోవలసి ఉందని  చాందీ పేర్కొన్నారు. ప్రస్తుత సమయం కాంగ్రెస్కే కాకుండా దేశమంతటికీ కీలక సమయమని చాందీ అభిప్రాయపడ్డారు. పార్టీ వీడిన నేతలందరినీ తాము తిరిగి కాంగ్రెస్‌లోకి ఆహ్వానిస్తున్నామని అన్నారు.

 

Trending News