నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఉత్తర భారతదేశంలో గత రెండురోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జనజీవనం స్తంభించింది. ఢిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, చండీగఢ్‌లలో రానున్న రెండు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.
ఢిల్లీ-ఎన్సీఆర్‌లో భారీ వర్షాలు
దేశ రాజధాని నగరం ఢిల్లీలో వర్షం బీభత్సం సృష్టిస్తున్నది. గురువారం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి రహదారులన్నీ జలమయమయ్యాయి. నగరంలోని పలు లోతట్టు ప్రాంతాల్లో మోకాలి లోతున నీరు నిలిచింది. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. మరోవైపు ఢిల్లీలో యమునా నదిలో ప్రవాహం ప్రమాదస్థాయికి చేరుకుంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు ఉత్తర్‌ప్రదేశ్‌లో ఐదుగురు చిన్నారుల సహా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఆగ్రాలో ఓ మూడంతస్తుల భవనం కుప్పకూలింది. ప్రమాదాన్ని ముందే ఊహించిన అధికారులు అందులో నివాసం ఉన్నవారిని ఖాళీ చేయించడంతో పెను ముప్పు తప్పింది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు డ్యాంలు నిండటంతో దిగువకు వరద నీరును గేట్లు ఎత్తి విడుదల చేస్తున్నారు.
Delhi: Water level in Yamuna river increases following rainfall; Visuals from Yamuna Ghat. Yesterday, 1,15,000 cusec of water was released from Haryana's Hathini Kund Barrage. pic.twitter.com/3PieLj1blz
— ANI (@ANI) July 28, 2018
మూడు రోజుల పాటు వర్షాలు
ఉపరితల ఆవర్తన ప్రభావంతో వచ్చే మూడు రోజులపాటు తెలంగాణలో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఏపీలోని పలు ప్రాంతాల్లో కూడా వర్షాలు పడే సూచనలు ఉన్నట్లు వివరించింది. శుక్రవారం కోస్తా, రాయలసీమల్లో రుతుపవనాలు బలహీన పడి, పలుచోట్ల ఎండ తీవ్రత కొనసాగింది. కాగా.. రానున్న 24 గంటల్లో కోస్తాలో పలుచోట్ల, రాయలసీమలో అక్కడక్కడా వర్షాలు కురవనున్నాయి. ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాకు ఆనుకుని నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని.. ఇది బలపడితే దక్షిణ కోస్తా, రాయలసీమల్లో వర్షాలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మరోవైపు శ్రీకాకుళం జిల్లాలో సముద్రం 20 మీటర్లు ముందుకు రాగా.. అధికారులు తీరప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు.