Shikhar Dhawan Reacting on Being Replaced by Shubman Gill in India ODI Team: టీమిండియా సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు మూడు ఫార్మాట్లలో టీమిండియాకు ఓపెనర్‌గా ఆడాడు. మరో ఓపెనర్ రోహిత్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేసిన గబ్బర్.. దూకుడుగా ఆడి జట్టుకు ఎన్నో విజయాలు అందించాడు. ఐసీసీ ట్రోఫీలలో బెస్ట్ ఓపెనర్‌గా పేరు తెచ్చుకున్నాడు. అయితే గత 2-3 ఏళ్లుగా నిలకడగా ఆడకపోవడం, యువ ఆటగాళ్లు రాణిస్తుండటంతో జట్టులో చోటు దక్కడం లేదు. ముందుగా టెస్ట్.. ఆపై టీ20, వన్డేలకు కూడా దూరమయ్యాడు. ధావన్ స్థానంలో యువ ప్లేయర్ శుభ్‌మన్ గిల్ సెటిల్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నాడు.
తన స్థానంపై తాజాగా ఓ షోలో శిఖర్ ధావన్ స్పందించాడు. కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్ తనను వన్డే ప్రపంచకప్‌లో ఆడించాలనుకున్నారని తెలిపాడు. రోహిత్ జట్టు పగ్గాలు అందుకున్నప్పుడే తనకు ఈ విషయం చెప్పారని గబ్బర్ పేర్కొన్నాడు. 'కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్ నాకు మద్దతు ఇచ్చారు. వన్డే క్రికెట్‌పై దృష్టి పెట్టమన్నారు. ఫోకస్ మొత్తం 2023 వన్డే ప్రపంచకప్‌పై ఉండాలని చెప్పారు. 2022లో వన్డేల్లో నేను నిలకడగానే ఆడాను. అదేసమయంలో శుభ్‌మన్ గిల్ టీ20, టెస్టు ఫార్మాట్లలో రాణిస్తున్నాడు. 2-3 సిరీస్‌లలో నా ఫామ్ తగ్గినప్పుడు గిల్‌కు అవకాశం ఇచ్చారు' అని ధావన్ తెలిపాడు.
'శుభ్‌మన్ గిల్ అంచనాలకు తగ్గట్టుగా ఆడాడు. టెస్టులు, టీ20లు రెండింటిలోనూ గిల్ బాగా రాణిస్తున్నాడని నేను అనుకుంటున్నా. ఇటీవల అతడు నాకంటే ఎక్కువ అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడుతున్నాడు. ఒకవేళ నేనే బీసీసీఐ సెలక్టర్‌గా ఉంటే.. నాకు బదులుగా గిల్‌కే అవకాశం ఇచ్చేవాడిని. ఇక ఇషాన్ కిషన్ కూడా బాగా ఆడుతున్నాడు. బంగ్లాదేశ్‌పై డబుల్ సెంచరీతో చెలరేగిపోయాడు. ఆ క్షణంలో నేను భారత జట్టుకు దూరమవుతానని అనుకున్నాను' అని శిఖర్ ధావన్ పేర్కొన్నాడు.
ఏడాది చివరలో జరిగే వన్డే ప్రపంచకప్‌లో కెప్టెన్ రోహిత్ శర్మకు జోడీగా శుభ్‌మన్ గిల్ ఆడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే మూడు ఫార్మాట్లలో రాణిస్తున్న గిల్.. టెస్ట్ వన్డేలలో చోటు ఖాయం చేసుకున్నాడు. గిల్ రాకతో శిఖర్ ధావన్ ఏకంగా భారత జట్టుకే దూరమయ్యాడు. అయితే ఐపీఎల్ 2023లో పంజాబ్ కింగ్స్ తరఫున ధావన్ చెలరేగితే.. మళ్లీ అతడికి జట్టులో అవకాశం దొరికే ఛాన్స్ ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.