ఆంధ్ర ప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ అమరావతిలో ఒకేసారి 10 ఐటీ కంపెనీలను ప్రారంభించారు. తాడేపల్లిలోని ఇన్ఫోసైట్ భవనంలో కంపెనీల ప్రారంభ కార్యక్రమం జరిగింది. ఏపీఎన్ఆర్టీ ఆధ్వర్యంలో 10 కంపెనీలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా పాలసీలు రూపొందించామని, రాయితీలు సకాలంలో ఇస్తున్నామని అన్నారు.
పెద్ద కంపెనీలు ఎంత ముఖ్యమో చిన్న మధ్య తరగతి కంపెనీలు కూడా అంతే ముఖ్యమని నారా లోకేశ్ అన్నారు. పరిశ్రమకు అవసరమైన విధంగా విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇస్తున్నామన్నారు. విభజన సమయానికి హైదరాబాద్లో 99.9 శాతం ఐటీ ఉద్యోగాలుంటే.. ఏపీలో 0.1 శాతం ఉండేవన్నారు. 53 శాతం కంపెనీలకు రూ.24 కోట్ల సబ్సిడీ ఇచ్చామని, ఐటీ రంగంలో 36 వేల మందికి ఉద్యోగాలు లభించనున్నాయన్నారు. అటు ఎలక్ట్రానిక్స్ రంగంలో మరో 20 వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయన్నారు. ప్రభుత్వంపై నమ్మకంతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చినందుకు కంపెనీ ప్రతినిధులకు లోకేశ్ కృతజ్ఞతలు తెలిపారు.