Cyber Fraud with Aadhaar Card : దేశంలో సైబర్ మోసాల సంఖ్య నానాటికి పెరిగిపోతోంది. కొంతమంది సైబర్ కేటుగాళ్లకు నేరుగా ఓటీపీ ఇచ్చి మరీ మోసపోతుండగా, ఇంకొంతమంది పోలీసులం అని చెప్పి వస్తోన్న ఫేక్ కాల్స్ వలలో పడి బ్యాంకు ఖాతాలు గుళ్ల చేసుకుంటున్నారు. అసలు విషయానికొస్తే.. మీకు మీ భార్య, సోదరి, కుమార్తె లేదా ఇంట్లో ఉండే ఎవరైనా వృద్ధులపై ఫిర్యాదు అందింది లేదా ఎఫ్ఐఆర్ నమోదు చేయబోతున్నట్లు పోలీసు స్టేషన్ నుండి మీకు కాల్ వచ్చిందనుకోండి.. ఎవరైనా సరే వెంటనే కంగారుపడి వాళ్లు అడిగిన అన్ని వివరాలు చెప్పేస్తారు. అక్కడే అందరూ తప్పులో కాలేస్తున్నారు. ఎందుకంటే మిమ్మల్ని లేనిపోని బెదిరింపులతో కంగారు పెట్టి, మీ నుంచే మీ వ్యక్తిగత వివరాలు రాబట్టి, మీ కంగారును క్యాష్ చేసుకోవాలని చూసే కేటుగాళ్లు ఎక్కువయ్యారనే విషయం మర్చిపోవద్దు. ఈ విషయంలో కూడా అదే జరుగుతోంది.
కొంతమంది కేటుగాళ్లు తాము ఫలానా పోలీసు స్టేషన్ నుంచి ఫోన్ చేస్తున్నాం అని చెప్పి మీ ఇంట్లో వాళ్లపై కేసు అయిందని బెదిరిస్తున్నారు. ఆ తరువాత వారికి కావాల్సిన ఆధార్ నెంబర్, పాన్ నెంబర్ వంటి వ్యక్తిగత సమాచారం అడిగి తెలుసుకుని మరీ ఆ వివరాలతోనే మోసాలకు పాల్పడుతున్నారు. పోలీసులు, కేసు అనగానే జనం కూడా ఎందుకొచ్చిన గొడవరా బాబూ అని వారు నిజమైన పోలీసులేనా కాదా అనే ఆలోచన కూడా లేకుండా వారు అడిగిన వివరాలు అన్నీ చెప్పేస్తున్నారు. అలా చేయడం తప్పు అనే విషయం మర్చిపోవద్దు.
మేం పోలీసులం అని చెప్పి మీకు కూడా అలాంటి ఇన్కమింగ్ కాల్స్ వస్తే టెన్షన్ పడకండి.. ఇలా చేయండి..
- భయాందోళన లేకుండా మాట్లాడండి. అలా చేయడం వల్ల అవతలి వ్యక్తి మిమ్మల్ని అంత ఈజీగా మోసం చేయలేడు. మీరు కూడా అతడి ఉచ్చులో పడే ప్రమాదం ఉండదు.
- కాల్ చేసిన వ్యక్తి ఎవరు ? ఏ పోలీస్ స్టేషన్ నుంచి చేస్తున్నారు ? కాల్ చేసిన వ్యక్తి పేరు, హోదా అడగం మర్చిపోవద్దు.
- అవతలి వ్యక్తి అడిగిన సమాచారం ఇవ్వకుండా, నకిలీ పోలీసును మాటల్లో పెట్టి ఆ వ్యక్తి నుండి మీరే పూర్తి సమాచారం రాబట్టాలి.
- ఫిర్యాదుదారుని పేరు, వారి వివరాలు, ఫిర్యాదుకు కారణం, తేదీ, సమయం వంటి వివరాలు ఆరా తీయండి. అలాంటప్పుడు ఫిర్యాదు చేసిన వ్యక్తి మీకు నిజంగా తెలుసా లేదా అనేది నిర్ధారించుకోవచ్చు.
- పోలీస్ స్టేషన్‌కు రావాల్సి ఉంటుంది అని పట్టుబట్టినట్లయితే, ఇప్పటికిప్పుడే కలవలేను. తర్వాత కలుస్తాను అని చెప్పండి. ఆ తరువాత ఈ మొత్తం విషయాన్ని మీకు బాగా తెలిసిన వారికి చెప్పి, ఆ ఫోన్ కాల్లో వాస్తవం ఉందా లేదా క్రాస్ చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి.
- ముఖ్యంగా, కాల్ వచ్చిన నంబర్ గురించి ఆరా తీయండి. వీలైతే ట్రూ కాలర్‌లో చెక్ చేయొచ్చు లేదా నేరుగా అధికారిక సంస్థ ద్వారానే కనుగొనే ప్రయత్నం చేయండి. ఒక్కోసారి మోసగాళ్లు ట్రూకాలర్లోనూ తమ పేరును పోలీసుల పేరు వచ్చేలా పెడుతుంటారు. కాబట్టి అన్ని సందర్భాల్లో ట్రూ కాలర్‌లో చూపించే డీటేల్స్ కరెక్ట్ అని కూడా అనుకోలేం అనే విషయాన్ని మర్చిపోవద్దు.
- ఇందులో మీకు ఏ మాత్రం అనుమానాస్పదంగా అనిపించినా వెంటనే ఆ నెంబర్‌తో పాటు మీరు కనుక్కున్న మొత్తం వివరాలు వెల్లడిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేయండి.