అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి అశ్విని పొన్నప్ప వివాహం రంగరంగ వైభవంగా జరిగింది. ప్రముఖ వ్యాపారవేత్త కరణ్ మేడప్పను ఆమె వివాహమాడారు. కర్ణాటకలోని కొడగు జిల్లా కూర్గ్ ప్రాంతంలో జరిగిన వీరి వివాహ వేడుకలకు కుటుంబ పెద్దలతో పాటు కొందరు ప్రముఖులు కూడా హాజరయ్యారు. వీరి నిశ్చితార్థం అక్టోబరులో జరిగింది. భారతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారిణుల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని కైవసం చేసుకున్న క్రీడాకారిణి అశ్విని పొన్నప్ప.
18 సెప్టెంబరు 1989 తేదిన జన్మించిన ఆమె 2015లో కెనెడా ఓపెన్‌లో జ్వాలా గుత్తాతో కలిసి టైటిల్ కైవసం చేసుకున్నారు. అలాగే దక్షిణాసియా క్రీడల్లో రెండు స్వర్ణాలు, ఒక రజతం గెలుచుకున్నారు. 2014లో ఆసియా క్రీడల్లో భారత్ తరఫున పాల్గొని కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నారు. 2010లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో మహిళల డబుల్స్‌లో స్వర్ణం గెలుచుకున్నారు.