ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2020)లో భాగంగా ముంబై ఇండియన్స్ (Mumbai Indians), ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) జట్ల మధ్య జరిగిన క్వాలిఫయర్ 1 మ్యాచ్‌లో ఓ చెత్త రికార్డు నమోదైంది. 201 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ టాప్ 3 బ్యాట్స్‌మెన్ డకౌట్ అయ్యారు. ఐపీఎల్ చరిత్రలో ఇలా జరగడం ఇది రెండోసారి మాత్రమే. గతంలో 2009లో చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌లో దక్కన్ ఛార్జర్స్ టాపార్డర్ ముగ్గురు బ్యాట్స్‌మెన్ ఔటయ్యారు. ఆ తర్వాత నిన్న మ్యాచ్‌లో రెండో పర్యాయం ముగ్గురు టాపార్డర్ ఆటగాళ్లు డకౌటయ్యారు.
ఢిల్లీ ఇన్నింగ్స్ తొలి ఓవర్ వేసిన ముంబై పేసర్ ట్రెంట్ బౌల్ట్ రెండో బంతికి ఓపెనర్ పృథ్వీ షా(0)ను, ఐదో బంతికి వన్ డౌన్ బ్యాట్స్‌మన్ అజింక్య రహానే (0)ను డకౌట్ చేశాడు. పృథ్వీ షా క్యాచ్ ఇచ్చి ఔట్ కాగా, రహానే ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. అనంతరం రెండో ఓవర్లో ముంబై పేసర్ జస్ప్రిత్ బుమ్రా మరో దెబ్బ తీశాడు. శతకాలు చేసి ఫామ్‌లో ఉన్న ఆటగాడు శిఖర్ ధావన్ (0)ను ఖాతా తెరవకుండానే బౌల్డ్ చేశాడు. దీంతో సున్నా పరుగులకే ఢిల్లీ ముగ్గురు టాపార్డర్ బ్యాట్స్‌మెన్ వికెట్లను కోల్పోయింది.
కాగా, తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 200 పరుగులు చేసింది. 201 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ ఏ దశలోనూ లక్ష్యాన్ని ఛేదించేలా కనిపించలేదు. 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 143 పరుగులు మాత్రమే చేయడంతో 57 పరుగుల తేడాతో ఢిల్లీపై ముంబై విజయం సాధించి సగర్వంగా ఆరోసారి ఐపీఎల్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. నేడు సన్‌రైజర్స్, బెంగళూరు మధ్య జరిగే మ్యాచ్‌లో నెగ్గే విజేతతో ఢిల్లీ తలపడనుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe