నిసార్ అహ్మద్.. ఢిల్లీ మురికివాడల్లో పుట్టిన యువ అథ్లెట్. అజాద్ పూర ఏరియాలో ఉండే చిన్న పాకలో తన తల్లిదండ్రులతో పాటు నివసించే అహ్మద్‌కు మంచి అథ్లెట్ అవ్వాలన్నదే కోరిక. ఆ కోరిక నుండే మేటి అథ్లెట్‌గా ఎదగాలన్న పట్టుదల పుట్టింది. అదే పట్టుదలతో రోజు రన్నింగ్ ప్రాక్టీసు చేస్తూ.. ఇటీవలే ఢిల్లీ రాష్ట్ర అథ్లెటిక్స్ పోటీల్లో రెండు జాతీయ రికార్డులు సాధించి, బంగారు పతకాలు సాధించాడు ఈ కుర్రాడు.
ఈ క్రమంలో గెయిల్ (గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా) అధికారుల దృష్టిలో పడ్డాడు. ఈ కంపెనీ ప్రతి సంవత్సరం భారతదేశంలోని ప్రతిభావంతులైన యువ అథ్లెట్లను గుర్తించి.. వారిని ప్రపంచ ప్రఖ్యాత అథ్లెట్ ఉసేన్ బోల్ట్ ఆధ్వర్యంలో జమైకాలో జరిగే నాలుగు వారాల ప్రత్యేక శిక్షణ క్యాంపుకి పంపిస్తోంది. ఈ సంవత్సరం ఈ క్యాంపుకి అహ్మద్ కూడా ఎంపిక కావడం విశేషం. ఏంజిలియన్ మెడల్ హంట్, కింగస్టన్ క్లబ్‌లు అథ్లెట్ల ఎంపికలో గెయిల్‌కు సహాయం అందిస్తాయి.
అహ్మద్ తండ్రి ఓ రిక్షా కార్మికుడు. వారి సంపాదన నెలకు 5000 కంటే తక్కువే. అయినా సరే.. నేడు ఈ స్థాయికి చేరిన అహ్మద్ కష్టం వెనుక చాలా త్యాగాలు ఉన్నాయని.. తనని ప్రోత్సహిస్తే నిజంగానే మంచి అథ్లెట్‌గా దేశానికి పతకాలు తీసుకొస్తాడని అంటున్నారు తనకు పాఠశాలలో కోచింగ్ ఇచ్చిన కోచ్ సురేందర్ సింగ్. తనకు దక్కిన అరుదైన అవకాశం పట్ల సంతోషం వ్యక్తం చేసిన అహ్మద్ మాత్రం తాను ఇంకా ఎన్నో మెడల్స్ దేశానికి సాధించపెట్టగలనన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు. తన కుటుంబ పరిస్థితి ఏ మాత్రం బాలేదని.. అయినా పట్టుదలతో మంచి అథ్లె్ట్‌గా రాణించి చూపిస్తానని అంటున్నాడు ఈ యువ అథ్లెట్.