లార్డ్స్ క్రికెట్ స్టేడియం వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న చివరి ఐదో టెస్టు రెండో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి భారత్ ఆరు వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసింది. కెప్టెన్ కోహ్లి (70 బంతుల్లో 49; 6 ఫోర్లు), ఓపెనర్ రాహుల్ (53 బంతుల్లో 37; 4 ఫోర్లు), పుజారా (101 బంతుల్లో 37; 5 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. ధావన్ (3), రహానే (0) నిరాశపరిచారు. ప్రస్తుతం క్రీజులో తెలుగబ్బాయి హనుమ విహారి(25), రవీంద్ర జడేజా (8) వ్యక్తిగత పరుగులతో ఉన్నారు. అయితే, ఇంగ్లండ్ కంటే భారత్ 158 పరుగుల వెనుకంజలో ఉంది.
ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్ట్‌లో తెలుగబ్బాయి హనుమ విహారి ఆకట్టుకున్నాడు. క్రీజులోకి వచ్చిన సమయంలో కాస్త ఒత్తిడితో కనిపించినప్పటికీ ఆ తర్వాత షాట్లతో బ్యాట్‌కి పనిచెప్పాడు. తొలి 29 బంతుల్లో రెండు పరుగులు మాత్రమే చేసిన విహారి.. స్టోక్స్ వేసిన 45వ ఓవర్లో సిక్స్, ఫోర్ కొట్టాడు. కర్రాన్ బౌలింగ్‌లోనూ రెండు ఫోర్లు కొట్టి.. ఆట ముగిసే సమయానికి 25 పరుగులు చేసి (3 ఫోర్లు, 1 సిక్స్) ప్రస్తుతం క్రీజులో ఉన్నాడు.
భారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న ఐదో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 332 పరుగులకు ఆలౌట్ అయిన విషయం తెలిసిందే. ఐదో టెస్టు మొదటిరోజు.. భారత్‌పై టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఏడు వికెట్లు కోల్పోయి 198 పరగులు చేసింది. రెండో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్ 332 పరుగులవద్ద ఆలౌట్ అయింది. బ్రాడ్ (38), బట్లర్ (89)లు తొమ్మిదో వికెట్‌కు 98 పరుగులను జోడించారు. భారత బౌలర్లు జడేజా 4 వికెట్లు తీయగా, బుమ్రా, ఇషాంత్ శర్మ మూడేసి వికెట్లు తీసుకున్నారు.