న్యూజీలాండ్‌తో వన్డే సిరీస్ గెలిచిన టీమిండియా.. చెలరేగిన అంబటి రాయుడు, పాండ్యా

న్యూజీలాండ్‌తో వన్డే సిరీస్ గెలిచిన టీమిండియా

Last Updated : Feb 3, 2019, 04:17 PM IST
న్యూజీలాండ్‌తో వన్డే సిరీస్ గెలిచిన టీమిండియా.. చెలరేగిన అంబటి రాయుడు, పాండ్యా

వెల్లింగ్టన్: ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా నేడు న్యూజిలాండ్‌తో జరిగిన చివరి వన్డేలోనూ టీమిండియా 35 పరుగుల తేడాతో విజయం సాధించి న్యూజిలాండ్‌పై వన్డే సిరీస్‌ని సొంతం చేసుకుంది. 5వ వన్డేలో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా, న్యూజీలాండ్‌కు 253 పరుగుల విజయ లక్ష్యాన్ని విధించగా.. అనంతరం లక్ష్యఛేదనలో బరిలోకి దిగిన కివీస్ జట్టు 44.1 ఓవర్లలో 217 పరుగులకే ఆలౌట్ అయింది. యుజ్వేంద్ర చాహల్ 3, మొహమ్మద్ షమి, హార్థిక్ పాండ్యా చెరో రెండు వికెట్లు తీసి కివీస్ ఆటగాళ్లను కోలుకోలేని దెబ్బతీశారు. 

11 ఓవర్లలో 38 పరుగులకే 3 కీలకమైన వికెట్లు కోల్పోయిన కివీస్ జట్టు ఆదిలోనే కష్టాల్లో పడింది. కొలిన్ మన్రో (24), నికోల్స్ (8), టేలర్ (1) వరుసగా విఫలమయ్యారు. ఆ తర్వాత కెప్టెన్ విలియమ్సన్ (39), నీషమ్ (44), లాథమ్ (37) బాధ్యాతయుతమైన ఇన్నింగ్స్ ఆడటంతో ఓటమి తీవ్రతను కొంత తగ్గించుకోగలిగారు. 

తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా కేవలం 18 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన అంబటి రాయుడు తన వికెట్‌ను కాపాడుకుంటూ 90 ప‌రుగులతో (113 బంతుల్లో 4X8, 6X4) టీమిండియా స్కోర్ పెంచి జట్టు విజ‌యంలో కీల‌క‌పాత్ర పోషించాడు. అందకుగాను అంబ‌టి రాయుడికి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు ద‌క్కింది. విజయ్ శంకర్ 45 పరుగులు (64 బంతుల్లో 4x4) చేయగా, చివర్లో చెలరేగి ఆడిన హార్థిక్ పాండ్య 45 పరుగులు (22 బంతుల్లో 4x4, 6x5) టీమిండియా స్కోర్ పెరగడంలో మరో కీలక పాత్ర పోషించారు. ఈ వన్డే సిరీస్‌లో 9 వికెట్లు తీసిన మ‌హ్మ‌ద్ ష‌మి మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డు సొంతం చేసుకున్నాడు.

Trending News