Faf du Plessis Praises Chennai Super Kings Skipper MS Dhoni Captaincy: చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ ప్రశంసల వర్షం కురిపించాడు. ధోనీ కెప్టెన్సీ అద్భుతంగా ఉంటుందని, అతడిని మించిన మరొక కెప్టెన్ ఉండడు అని అన్నాడు. ధోనీని దూరం నుంచే పరిశీలించేవాడినని, చాలా సంవత్సరాలుగా ఎందుకు అతడు విజయవంతమయ్యాడని ఆలోచించా అని ఫాఫ్ పేర్కొన్నాడు. ఐపీఎల్‌లో ఎంఎస్ ధోనీ నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్‌తో పాటు రైజింగ్ పుణె సూపర్ జెయింట్‌కు ఆడిన డుప్లెసిస్.. 2022 నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఆడుతోన్న విషయం తెలిసిందే.
ఫాఫ్ డుప్లెసిస్ తాజాగా ఓ ఛానల్‌తో మాట్లాడుతూ భారత ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోనీ మాదిరి సారథిగా ఉండలేనని చెప్పాడు. 'ధోనీ, కోహ్లీ అద్భుతమైన క్రికెటర్లు. వారి కెప్టెన్సీలో వద్ద ఆడటం బాగుంది. నేను ఎంతో నేర్చుకున్నా. నేను జాతీయ జట్టులోకి వచ్చినప్పుడు దక్షిణాఫ్రికా కెప్టెన్‌గా గ్రేమీ స్మిత్ ఉండేవాడు. ఐపీఎల్‌లో చెన్నై తరఫున తొలి సీజన్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. అయినా సరే చాలా అంశాలను నేర్చుకున్నా. కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ పక్కనే కూర్చొని ప్రతి విషయం తెలుసుకునేవాడిని. ఎక్కువగా కెప్టెన్సీ గురించే మాట్లాడేవాడిని. ధోనీని దూరం నుంచే పరిశీలించా. చాలా సంవత్సరాలుగా మహీ ఎందుకు విజయవంతమయ్యాడని ఆలోచించా' అని ఫాఫ్ చెప్పాడు.
'అందరి కెప్టెన్సీని పరిశీలించినా ఎప్పుడూ కూడా ఎంఎస్ ధోనీ, గ్రేమీ స్మిత్, స్టీఫెన్ ఫ్లెమింగ్, విరాట్ కోహ్లీలా మారాలని ప్రయత్నించలేదు. నాదైన శైలిలోనే జట్టును నడిపించడం నేర్చుకున్నా. అయితే ధోనీ నుంచి నిశ్శబ్దంగా ఉండటం నేర్చుకున్నా. నా ఆటగాళ్లకు సంబంధించి నేను చాలా స్పష్టతతో ఉంటా. మీ పూర్తిస్థాయి ప్రదర్శనను ఇవ్వండని ఆటగాళ్లకు చెబుతుంటా. ఇలా చేయడం వల్లే ధోనీని కెప్టెన్ కూల్ అని అభిమానులు ముద్దుగా పిలుచుకుంటారు. ధోనీని మించిన మరొక కెప్టెన్ ఉండడు' అని బెంగళూరు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ చెప్పుకొచ్చాడు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఐపీఎల్ 2023 ప్లేఆఫ్స్ రేసులో ఉంది. ఆడిన 12 మ్యాచులలో 6 విజయాలతో ప్రస్తుతం 12 పాయింట్లతో పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతోంది. బెంగళూరు మరో రెండు మ్యాచులు ఆడాల్సి ఉంది. ఆ రెండు మ్యాచులలో విజయం సాధిస్తే.. ప్లేఆఫ్స్ అవకాశాలు మెండుగా ఉంటాయి. ఒక్క మ్యాచ్ ఓడితే మాత్రం ప్లేఆఫ్స్ ఆశలు గల్లంతే. గురువారం (మే 18) ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో (SRH vs RCB) తలపనుంది. ఈ మ్యాచ్ కోసం ఫాఫ్ సేన ఇప్పటికే హైదరాబాద్ చేరుకొని ప్రాక్టీస్ చేస్తోంది. ఇక మే 21న గుజరాత్‌తో బెంగళూరు తలపడనుంది.
Also Read: XUV400 Vs Nexon EV: టాటా నెక్సాన్ ఈవీ vs మహీంద్రా ఎక్స్‌యూవీ400.. బ్యాటరీ, రేంజ్ వివరాలు ఇవే!
Also Read: Maruti Baleno Price 2023: ఆల్టో ధరలో బాలెనోను ఇంటికి తీసుకెళ్లండి.. మీకు చాలా డబ్బు ఆదా!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.