England vs Ireland: టీ20 వరల్డ్ కప్‌లో సంచలనం.. ఇంగ్లండ్‌కు షాకిచ్చిన ఐర్లాండ్

Ireland Beat England: టీ20 వరల్డ్ కప్‌లో సంచలనం నమోదైంది. ఇంగ్లాండ్‌కు పసికూన ఐర్లాండ్ షాకిచ్చింది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 26, 2022, 02:42 PM IST
  • ఇంగ్లండ్‌ను ఓడించిన ఐర్లాండ్
  • 5 పరుగుల తేడాతో విజయం
  • డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో విజయం
England vs Ireland: టీ20 వరల్డ్ కప్‌లో సంచలనం.. ఇంగ్లండ్‌కు షాకిచ్చిన ఐర్లాండ్

Ireland Beat England: టీ20 వరల్డ్ కప్‌లో ఇంగ్లాండ్‌పై ఐర్లాండ్ సంచలన విజయం సాధించింది. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌కు ఐర్లాండ్ షాకిచ్చింది. డక్ వర్త్ లూయిస్‌ పద్ధతిలో 5 రన్స్‌ తేడాతో విజయం సాధించింది. ఇంగ్లండ్ విజయానికి 33 బంతుల్లో 53 పరుగులు అవసరమైన దశలో.. వర్షం పడడంతో మ్యాచ్ నిలిచిపోయింది. దీంతో డక్‌వర్త్‌ లూయిస్ పద్ధతిలో ఐర్లాండ్‌ను విజేతగా ప్రకటించారు అంపైర్లు. మొదట బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 19.2 ఓవర్లలో 157 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం ఇంగ్లండ్ 14.3 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 105 రన్స్ చేసింది. 

టాస్‌ గెలిచిన ఇంగ్లండ్ బౌలింగ్ ఎంచుకోవడంతో ఐర్లాండ్ మొదట బ్యాటింగ్‌కు వచ్చింది. సిక్స్, ఫోర్ బాది దూకుడు మీద కనిపించిన ఓపెనర్ స్టిర్లింగ్‌ను మార్క్‌ వుడ్ పెవిలియన్‌కు పంపించాడు. మరో ఓపెనర్ బెల్బిర్నీ, వన్‌ డౌన్ బ్యాట్స్‌మెన్ టక్కర్‌ జట్టును ఆదుకున్నారు. బెల్బిర్నీ ఆచితూచి ఆడగా.. టక్కర్‌ దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. దీంతో పది ఓవర్లకే ఐర్లాండ్‌ స్కోరు 92 పరుగులకు చేరుకుంది. 34 పరుగులు చేసిన టక్కర్‌ రనౌట్ అవ్వడంతో ఐర్లాండ్‌ జోరుకు కళ్లెం పడింది. బెల్బిర్నీ 62 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరుకోగా.. మిగిలిన బ్యాట్స్‌మెన్‌ అంతా విఫలమయ్యారు. చివరికి 19.2 ఓవర్లలో 157 రన్స్‌కు ఆలౌట్ అయింది. ఇంగ్లండ్‌ బౌలర్లలో మార్క్‌వుడ్‌, లివింగ్‌స్టోన్‌ చెరో 3 వికెట్లు తీశారు. సామ్‌ కర్రాన్‌ 2, బెన్‌స్టోక్స్‌కు ఒక వికెట్‌ పడగొట్టారు. 

158 పరుగుల టార్గెట్‌తో ఇంగ్లండ్‌ బరిలోకి దిగగా.. ఆదిలోనే పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్ జోస్ బట్లర్ మొదటి ఓవర్ రెండో బంతికే ఔటయ్యాడు. ఆ తరువాత అలెక్స్‌ హేల్స్‌ (7), బెన్ స్టోక్స్‌ (6) కూడా వెంటవెంటనే పెవిలియన్‌కు చేరుకోవడంతో ఇంగ్లండ్ కష్టాల్లో పడిపోయింది. ఆ తరువాత డేవిడ్ మలాన్ (35), బ్రూక్ (18) ఇన్నింగ్స్‌ను కాస్త చక్కదిద్దారు. 14.3 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టానికి 105 పరుగులు చేసిన ఇంగ్లండ్.. 33 బంతుల్లో 53 పరుగులు చేస్తే విజయం సాధించేది. క్రీజ్‌లో మొయిన్ అలీ (24), లివింగ్‌స్టోన్ (1) క్రీజ్‌లో ఉండడంతో విజయంపై ధీమాతో ఉంది. 

అయితే ఈ సమయంలో వర్షం మ్యాచ్‌కు అంతరాయం కలిగించింది. కానీ వరుణుడి రూపంలో ఐర్లాండ్‌కు కలిసివచ్చింది. ఉత్కంఠసాగుతున్న సమయంలో వర్షం రావడంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. వర్షం కాసేపు ఆగి మళ్లీ కురవడంతో చివరికి మ్యాచ్‌ను ఆపేశారు అంపైర్లు. డక్‌వర్త్ లూయిస్‌ పద్ధతిలో ఐర్లాండ్ 5 పరుగుల తేడాతో గెలుపొందినట్లు ప్రకటించారు. ఐర్లాండ్ బౌలర్లలో లిటిల్ 2 వికెట్లు పడగొట్టగా.. మెక్‌కార్తీ, ఫిన్‌హ్యాండ్, డాక్రెల్ చెరో వికెట్ తీశారు. మ్యాన్‌ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు బెల్బిర్నీకి దక్కింది.

Also Read: Arvind Kejriwal: కరెన్సీ నోట్లపై లక్ష్మీదేవి, గణేష్‌ బొమ్మలు.. కేంద్రానికి సీఎం కేజ్రీవాల్‌ రిక్వెస్ట్

Also Read: నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌కు స్టార్‌ ప్లేయర్‌ దూరం.. టీమిండియా కోచ్‌ ఏం చెప్పాడంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News