తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు తనను బలి చేయాలని చూస్తున్నారు కానీ అది ఎప్పటికీ జరగదు అని అన్నారు నల్గొండ నుంచి తెలంగాణ అసెంబ్లీకి ప్రాతినిథ్యం వహిస్తోన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి ప్రభుత్వంపై నిరసన వ్యక్తంచేసిన అనంతరం అసెంబ్లీ లాబీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. తెలంగాణ సీఎం కేసీఆర్‌పై పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ నల్గొండ నుంచి పోటీ చేసి తనని ఓడించాలని చూస్తున్నారు. కానీ ఒకవేళ కేసీఆర్ నల్గొండ నుంచే పోటీ చేస్తే, తాను ఇంట్లో కూర్చున్నా గెలుస్తానని కోమటిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
నల్గొండ జిల్లాలో రెడ్డి సామాజికవర్గం, సెటిలర్స్ ఎక్కువగా ఉన్నారు. అంతేకాకుండా రెడ్డి సామాజిక వర్గం టీఆర్ఎస్కు ఓటేయదు అని కోమటిరెడ్డి అభిప్రాయపడ్డారు. సీఎం కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తోన్న గజ్వేల్‌లోనూ కేసీఆర్ కన్నా తనకే ఎక్కువ మంది బంధువులు ఉన్నారని, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశిస్తే గజ్వెల్ నుంచి పోటీ చేయాడానికైనా తాను సిద్ధమేనని కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరోసారి స్పష్టం చేశారు. గజ్వెల్ నియోజకవర్గం నుంచి పోటీ విషయంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇలా వ్యాఖ్యానించడం ఇదేం మొదటిసారికాదు. ఇటీవల సంగారెడ్డిలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలోనూ కోమటిరెడ్డి కేసీఆర్‌కి ఇదే సవాల్ విసిరారు.