టి.కాంగ్రెస్ లో వర్గ పోరు ; రేవంత్ టీంకు ఎన్ని సీట్లు దక్కేను ?

ఢిల్లీ వేదికగా జరగుతన్న కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం వాడీవేడీగా జరుగుతోంది

Last Updated : Nov 6, 2018, 09:16 PM IST
టి.కాంగ్రెస్ లో వర్గ పోరు ; రేవంత్ టీంకు ఎన్ని సీట్లు దక్కేను ?

ఢిల్లీ: రేవంత్‌రెడ్డి డిమాండ్ తో కాంగ్రెస్ స్ర్కీనింగ్ కమిటీ సమావేశంలో వాడీ వేడి చర్చకు దారి తీసింది. ప్రముఖ మీడియా కథనం ప్రకారం సీట్ల సర్దుబాటు వ్యహారంలో తనతో పాటు వచ్చిన వారికి న్యాయం చేయాల్సిందేనంటూ రేవంత్ పట్టుబట్టారు. అయితే దీన్ని పలువురు కాంగ్రెస్ సీనియర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది. కుల, ప్రాంతీయ సహా పలు అంశాలను పరిగణనలోకి తీసుకొని సీట్ల కేటాయింపుపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందని..ప్రస్తుతం రేవంత్ కోరుతున్న సీట్లు ఇవ్వడం సబబు కాదని.. సీనియర్లు అధిష్టానానికి సూచించినట్లు తెలిసింది. మరోవైపు రేవంత్ రెడ్డి తనతో కాంగ్రెస్ చేసుకున్న ఒప్పందాన్ని గుర్తు చేస్తూ తనను నమ్ముకొని పార్టీలో చేరిన వారికి న్యాయం చేయాలని పట్టుబడుతున్నారు.ఈ నేపథ్యంలో తాజా పరిణామాలు ఉత్కంఠతకు దారి తీస్తున్నాయి.

రాహుల్‌- రేవంత్ ఒప్పందంలో ఏముంది ?
రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంలో తనకు ప్రచార కమిటీ ఛైర్మన్ పదవి తో పాటు సీట్ల కేటాయింపు విషయంలో తనతో వచ్చిన వారిలో 15 మందికి సీట్లు కేటాయించేలా రాహుల్ గాంధీతో ఒప్పందం చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి రేవంత్ రెడ్డి తో పాటు కాంగ్రెస్ లో చేరిన వారిలో దాదాపు 20 మంది వరకు సీట్లు ఆశిస్తున్నారు. కాగా ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించేలా ఆయన వర్గానికి 8 వరకు మాత్రమే సీట్లు కేటాయించేందుకు కాంగ్రెస్ సిద్ధపడినట్లు తెలుస్తోంది. దీంతో కాంగ్రెస్ సీనియర్ల వైఖరిపై రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తూ స్ర్కీనింగ్ కమిటీ నుంచి బయటికి వెళ్లిపోయినట్లు టాక్. కాగా పలువురు నేతలు బుజ్జగించడంతో ఆయన తిరిగి సమావేశంలో జాయిన్ అయ్యారు. అర్థరాత్రి వరకు జరిగే ఈ స్ర్కీనింగ్ కమిటీ సమావేశంలో రేవంత్ వర్గానికి ఎన్ని సీట్లు ఇస్తారనే అంశం తేలనుంది.

Trending News