IAS Smita Sabharwal Posting: తెలంగాణలో సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్‌కు కీలక పదవి దక్కబోతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్న స్మితాకు త్వరలోనే ప్రభుత్వంలో కీలక పోస్టు ఇచ్చే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. అలాగే స్మితా సబర్వాల్ భర్త అకున్ సబర్వాల్ కూడా త్వరలోనే తెలంగాణకు రాబోతున్నారు ప్రస్తుతం ఆయన కేంద్ర సర్వీసులో ఉన్నారు. ఆయన్ను ఇటీవల కేంద్ర ప్రభుత్వం తిరిగా తెలంగాణకు కేటాయించడంతో రాష్ట్రానికి రానున్నారు. ఆయనకు కూడా తిరిగి డ్రగ్స్ కంట్రోల్ డైరెక్టర్ పదవి ఇచ్చే యోచనలో ప్రభుత్వం ఆలోచన చేస్తోందని తెలుస్తోంది..
Also Read: Peddireddy Ramachandra Reddy: మాజీ సీఎం జగన్‌కు ముఖం చాటేసిన పెద్దిరెడ్డి.. అసలు కారణం ఇదేనా..!
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయంలో స్మితా సబర్వాల్ కీలకంగా వ్యవహరించారు. అప్పటి సీఎం కేసీఆర్‌కు పర్సనల్ సెక్రటరీగా సేవలందించారు. అంతేకాదు.. సాగునీటి ప్రాజెక్టులను పర్యవేక్షణ చేశారు. సీనియర్ అధికారిగా ఉన్న స్మితాకు కేసీఆర్ అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. పాలనపై మంచి పట్టు ఉండటంతో స్మిత సబర్వాల్‌కు కేసీఆర్ ఎక్కడ లేనంతా ప్రాధాన్యత ఇచ్చారు. ఒకనొక సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు స్మితా సబర్వాల్ హెలికాప్టర్‌లో వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. కానీ గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ ఓడిపోవడం.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాయి. కాంగ్రెస్ ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. అయితే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవగానే స్మితా సబర్వాల్ ఆయన్ను కలిసేందుకు వెళ్లలేదు. అందుకే ఆమెకు అప్రాధాన్య పోస్టు కేటాయించారని ప్రచారముంది. గతంలో సీఎంవో సెక్రటరీగా ఉన్న స్మితా సబర్వాల్.. కాంగ్రెస్ ప్రభుత్వంలో పైనాన్స్ సెక్రటరీగా కొనసాగుతున్నారు.
ఇక అకున్ సబర్వాల్ గతంలో తెలంగాణలో డ్రగ్స్ కేసుతో ఓ వెలుగు వెలిగారు. ఆయన డ్రగ్ కంట్రోల్ డైరెక్టర్‌గా ఉన్న సమయంలో డ్రగ్స్ కేసు సంచలనం రేపింది. పలువురు సినీనటులు డ్రగ్స్ తీసుకుంటారని తెలియడంతో ఈ కేసును అత్యంత కీలకంగా తీసుకున్నారు ఆయన.. ఈ కేసులో పలువురు సినీనటులను విచారించారు. డ్రగ్స్ తీసుకున్న కొందరు నటీనటులపై సీరియస్ యాక్షన్ తీసుకోవాలని ప్రభుత్వానికి నివేదిక సైతం సమర్పించారు. కానీ ఈ కేసు విచారణ క్రమంలోనే ఆయన్ను తెలంగాణ సర్కార్ తప్పించడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. ఆ తర్వాత కేసు పూర్తిగా మరుగున పడిపోయింది. కానీ ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ డ్రగ్స్ వినియోగంపై ఉక్కుపాదం మోపుతోంది. ఎవరైనా డ్రగ్స్ అమ్మినా, సేవించినా కఠిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించింది. హైదరాబాద్ నగరాన్ని డ్రగ్స్ ఫ్రీ నగరంగా మార్చాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అకున్ సబర్వాల్‌కు మరోసారి డ్రగ్ కంట్రోల్ డైరెక్టర్ పదవిని అప్పగించాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.. అకున్ కీలక బాధ్యతలు అప్పగించడం ద్వారా.. డ్రగ్స్ వినియోగాన్ని అరికట్టడంతో పాటు.. గత కేసును తిరగదోడి నిందితులకు కఠిన శిక్ష పడేలా చూడాలని అనుకుంటున్నట్టు తెలుస్తోంది.
మరోవైపు తెలంగాణలో ప్రస్తుతం ఐఏఎస్‌ల కొరత తీవ్రంగా ఉంది. మొన్నటివరకు తెలంగాణలో సేవలందించిన పలువురు ఐఏఎస్ అధికారులు ఏపీ కేడర్‌కు తిరిగి వెళ్లిపోయారు. ప్రభుత్వంలో సీనియర్లుగా ఉన్న కీలక అధికారులు ఏపీకి వెళ్లిపోవడంతో ప్రస్తుతమున్న సీనియర్లకు కీలక బాధ్యతలు అప్పగించాలని సీఎం భావిస్తున్నట్టు తెలిసింది. ప్రభుత్వం ప్రభుత్వంలో కీలకంగా పైనాన్స్ సెక్రటరీ రామకృష్ణారావు, జయేష్ రంజన్, నవీన్ మిట్టల్ లాంటి అధికారులు ఉన్నారు. మరోవైపు స్మిత సబర్వాల్‌కు కూడా సీనియర్ అధికారిగా మంచి గుర్తింపు ఉంది. అందుకే ఆమెను లైమ్‌లైట్‌లోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చూస్తున్నట్టు తెలుస్తోంది..
మొత్తంగా గత ప్రభుత్వంలో ఓ వెలుగు వెలిగిన స్మితా సబర్వాల్‌కు ఏ పోస్టు ఇస్తారనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారింది. మొన్నటివరకు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా పనిచేసిన అమ్రపాలి ఏపీలో వెళ్లిపోయారు. ప్రస్తుతం ఆ పోస్టులో ఎవరిని నియమించలేదు.. అయితే త్వరలోనే జీహెచ్‌ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. ప్రభుత్వ పథకాలను భారీ ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో స్మితాకు జీహెచ్‌ఎంసీ కమిషనర్ పోస్టు ఇవ్వాలని సీఎంను కొందరు నేతలు సైతం కోరుతున్నట్టు పార్టీ వర్గాలు అంటున్నాయి. మొత్తంగా ఇప్పుడు తెలంగాణలో కీలకం కాబోతున్న స్మితా సబర్వాల్- అకున్ సబర్వాల్‌కు ఏ పోస్టులు కేటాయిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది.
Also Read: KTR: బరాబర్ జైలుకు పోతా.. రేవంత్ రెడ్డి అయ్యకు కూడా భయపడను