బ్యూరోక్రాట్స్ అనగానే మనకు కొన్ని సందర్భాల్లో.. ప్రజలకు చాలా దూరంగా ఉంటారు అన్న ఫీలింగ్ వస్తుంటుంది. కొందరు బ్యూరోక్రాట్స్ ప్రజలకు భయాన్ని కూడా కలిగిస్తుంటారని వార్తలు వచ్చాయి. ఆ మధ్య ఒక ఐపీఎస్ అధికారి దేవుని గుళ్ళోకి తుపాకీతో వెళ్లి.. హడావుడి చేస్తూ.. భక్తులను ఆందోళనకు గురిచేసాడని కూడా విన్నాం. అయితే బ్యూరోక్రాట్స్‌లో నలుగురికీ ఆదర్శంగా నిలిచేవారు కూడా కొంతమంది ఉన్నారు. అలాంటి వారిలో ఒకరే చందన దీప్తి. ఈమె సంప్రదాయ బ్యూరోక్రాట్స్‌కు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ప్రజలతో పూర్తి స్థాయిలో మమేకం అవుతూ.. తనదైన శైలిలో తన పని తాను చేసుకొని పోతూ.. నలుగురికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. 2012 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసరైన... అచ్చ తెలుగమ్మాయి చందన దీప్తి. ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ఈమె రాష్ట్ర విభజనలో భాగంగా తెలంగాణలో సేవలందిస్తున్నారు. ఎప్పుడో తెలంగాణ సీఎం కెసిఆర్ తన మెదక్ జిల్లా అధికారిక పర్యటన సందర్బంగా ఓ చిన్నారి చదువు బాధ్యతను డిపార్ట్ మెంట్‌కి అప్పగించగా.. ఆ చిన్నారి బాధ్యతలను స్వయంగా ఈ అధికారిణి తీసుకోవడం విశేషం. వరంగల్ ప్రాంతంలో ఒకసారి జరిగిన యాసిడ్ దాడి ఘటన చందనను ఐపీఎస్ వైపు అడుగులు వేయించింది.
ఐపీఎస్ అధికారైనా కూడా.. చందన దీప్తి సైకిల్ పై మెదక్ గల్లీల్లో తిరుగుతుంటారు. ప్రజల సమస్యలను ప్రజల వద్దకు వెళ్లి స్వయంగా తెలుసుకుంటారు. వాటిని పరిష్కరించడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ బయట ప్రపంచానికి ఈమె గురించి చాలా తక్కువగా తెలుసు. ఈ యువ అధికారిణి ప్రస్తుతం మెదక్ జిల్లా ఎస్పీగా విధులు నిర్వహిస్తున్నారు. ఇంతకు ముందు నిజామాబాద్ ఓఎస్డీగా కూడా పని చేశారు. ఆమెని చూడగానే ప్రశాంతతకు మరో రూపం ఆమేనని అనిపించక మానదు.
నిజానికి యూపీఎస్సీ పరీక్షలో పాసై ఏదో కేంద్ర సర్వీస్ దక్కితే చాలు...ఇంకేం అవసరం లేదు అన్నది చాలా మంది అభ్యర్థుల భావన. అలాగే.. ఆ పదవి ద్వారా దక్కే జీతం, హోదా పులపాన్పు అవుతుందనిపిస్తుంది. కానీ అలాంటి పదవులకు విలువ తీసుకొచ్చే వారు కొందరు మాత్రమే. అలాంటి కోవకు చెందిన వారే చందన దీప్తి.
ప్రజలకు సేవ చేయడాన్ని ఎంతగా ప్రేమిస్తారో.. అక్రమార్కుల గుండెల్లో గుబులు పుట్టించడానికి కూడా అంతే సిద్ధంగా ఉంటారు చందన. నిరాడంబరంగా ఉండడం ఆమె ప్రత్యేకత . ప్రజావాణిలో ప్రతి వారం న్యాయం కోసం వచ్చే సామాన్య ప్రజలతో చాలా చొరవతో మాట్లాడడం ఆమె నైజం. ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా శ్రద్ద చూపడాన్ని బాధ్యతగా భావిస్తుంటారు. అందుకే ఆమె కథ నలుగురికీ ఆదర్శమైంది. ఏదైనా వీధిలో కార్డెన్ సెర్చ్ అంటే ఈ రోజుల్లో జనం వణికిపోతుంటారు. పోలీసులు ఎక్కడ తమ పై జులుం చూపిస్తారో అని అనుకుంటారు. కానీ చందన ఆధ్వర్యంలో జరిగే కార్డెన్ సెర్చ్ విభిన్నంగా సాగుతుంది. యువతీ, యువకులకు ప్రేరణ కలిగించే విషయాలను ఆమె ఇలాంటి సందర్భాల్లో చెబుతుంటారు. వారి బాధ్యతను వారికి గుర్తుచేస్తుంటారు. మెదక్‌లో ప్రజలకు సిసలైన ఫ్రెండ్లీ పోలీసింగ్ ఎలా ఉంటుందో చూపించిన ఘనత చందనదే కావడం విశేషం. అందుకే ఎప్పుడూ వార్తల్లో నిలిచే స్మితా సబర్వాల్... ఆమప్రాలి..వంటి ఆఫీసర్ల సరసన చందన దీప్తి కూడా చేరారు.